రాజయ్యపేటలో ఆందోళన చేస్తున్న మత్య్సకారులు
నక్కపల్లి: రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేయబోమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చి మాట తప్పారంటూ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సోమవారం గ్రామంలో మైలపల్లి మహేష్, సోమేష్ ఆధ్వర్యంలో పలువురు మత్య్సకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తమ గ్రామంలో బల్క్‌డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ 76 రోజుల పాటు ఆందోళన, నిరాహార దీక్ష చేశామన్నారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలవడంతో తాళ్లపాలెం వద్ద సీఎం చంద్రబాబుని గ్రామస్తులంతా కలిశామన్నారు. మీ గ్రామ పరిధిలో బల్క్‌డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేయబోమని, మీరు కోరిన అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇది జరిగి 93 రోజులు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోగా బల్క్‌డ్రగ్‌పార్క్ పనులు యథావిధిగా జరుగుతున్నాయని తెలిపారు. తమకు అండగా నిలిచిన వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి నెలల తరబడి జైల్లో పెడుతున్నారన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు.


