అనకాపల్లి: మాజీ మంత్రి, దివంగత నాయకుడు గుడివాడ గురునాథరావు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతమైన జిల్లాలో కొంతమంది దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం అన్యాయమన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. గురునాథరావు అభిమానులు అనకాపల్లి మండలం తగరంపూడిలో 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి ఉంటారని చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు గురునాథరావు అభిమానులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
అంతర్ జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీలకు నాగజ్యోతి ఎంపిక
రోలుగుంట: హర్యానా రాష్ట్రం సోనిపట్‌లో ఆది వారం నాచురల్ స్ట్రాంగ్ పవర్ లిప్టింగ్ ఫెడరేషన్(ఎన్‌ఎస్‌పీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీల్లో రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పి.వి.ఎం.నాగ జ్యోతి ప్రతిభ చూపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో మన రాష్ట్రం నుంచి పాల్గొన్న నాగజ్యోతి ప్రతిభ చూపి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి 25 వరకూ పోలెండు దేశంలో పాబియాయనీస్ నగరంలో జరగనున్న ప్రపంచ లిప్టింగు చాంపియన్‌షప్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంటారు. జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వి.శేషగిరిరావు, సహచర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


