నక్కపల్లి: మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ నిర్వాసితులకు మాత్రం నోట్లో మట్టికొట్టిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆరోపించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతోమాట్లాడుతూ మొదటి విడతలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని చెబుతూ రూ.40వేల కోట్ల రాయితీలు ప్రకటించడం దారుణమన్నారు. 2,200 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇచ్చారన్నారు.అలాగే 15 ఏళ్లపాటు జీఎస్‌టీ మినహాయింపు, 15 ఏళ్లపాటు విద్యుత్‌ను యూనిట్‌కు ఒక్కరూపాయికే ఇవ్వడంకంపెనీకి కావాల్సిన నీటిని కిలోలీటరును కేవలం యాభైపైసలకు ఇవ్వడం విడ్డూరమన్నారు. ఎకరా కోటిరూపాయలు విలువ చేసే భూములను రూ.51లక్షలకే కట్టబెట్టారని చెప్పారు.ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌కు లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ భూములు,నివాస ప్రాంతాలు త్యాగం చేసిన వారికి మాత్రం నోట్లో మట్టికొట్టి, అరకొరగా పరిహారం చెల్లించడం దుర్మార్గమని తెలిపారు.వివాహం అయిన ఆడపిల్లలకు ఇప్పటి వరకు ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ ఇవ్వలేదన్నారు.రూ.25లక్షలు ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు కోరితే కేవలం రూ.8.98 లక్షలు మాత్రమే చెల్లించారన్నారు.ఈ సమావేశంలో నాయకులు ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


