● రూ.వేలల్లో వస్తుండడంతో ఆందోళన
● నిరసన వ్యక్తం చేసిన ఆదివాసీలు
రోలుగుంట: ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు సర్కార్ మోసంతో గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగా, కూటమి సర్కార్ బలవంతపు వసూళ్లకు దిగుగుతూ వేలల్లో బిల్లులు పంపిస్తోంది. మండలంలో పలు గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీంతో ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వేలల్లో వచ్చి న బిల్లులు చూపిస్తూ ఆదివారం పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలో అర్ల పంచాయతీ శివారు కొత్తలోసింగి, లోసింగి,పెదగరువు,పీత్రిగెడ్డ,నీళ్లబంద తదితర గ్రామాల్లో 62 పీటీజీ గొందు ఆదివాసీ కుటుంబాలు పెంకులు, మట్టిగోడలతో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వారికి గత ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శిఖరాగ్ర గ్రామాల్లో విద్యుత్ బిల్లులు తీయడం మొదలెట్టారు. అధిక మొత్తంలో బిల్లులు పంపుతూ, చెల్లించకపోతే సరఫరా కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని పలు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రిజ్‌లు, ఏసీలు లేవు, రెండు బల్బులు మాత్రమే వినియోగించుకుంటున్నాం, వర్షం పడితే మా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది, మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదని వారు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 60 యూనిట్లు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయని, చెల్లించకపోతే లైను కట్ చేస్తామని బెదిరిస్తున్నారని పలు గ్రామాల గిరిజనులు వాపోయారు. బిల్లులపై పరిశీలించి పునఃసమీక్షించాలని లేకుంటే కాగడాలతో ఆందోళన చేస్తామని లోసింగి, కొత్తలోసింగి, పీత్రిగెడ్డ గ్రామాలకు చెందిన కిలో నరసయ్య, కిలో రుక్మి, కిలో మహేష్, సీపీఎం కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు హెచ్చరించారు.


