అచ్యుతాపురం రూరల్: ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన మండలంలోని చోడపల్లిలో చోడమాంబిక అమ్మవారి మెరుపులు పుట్టుక జాతర మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ జాతరలో భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. అమ్మవారితో పాటు ఈ ఉత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున కొండపై వచ్చే మెరుపులను భక్తులు దర్శించుకుంటారు. మెరుపులు అమ్మవారికి ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అచ్యుతాపురం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలను కొండకర్ల మీదుగా మడుతూరుకు, అచ్యుతాపురం నుంచి వచ్చే వాహనాలను మడుతూరు కూడలి నుంచి కొండకర్ల మీదుగా మళ్లించనున్నారు. పండగ సందర్భంగా ఎస్‌టీడీఎల్ రోడ్డు మీదుగా చోడపల్లి వైపునకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.


