వంటింట్లో నూనె మంట | - | Sakshi
Sakshi News home page

వంటింట్లో నూనె మంట

Mar 21 2026 5:05 AM | Updated on Mar 21 2026 5:05 AM

అనకాపల్లి: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మన వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే గ్యాస్‌ ట్రబుల్‌తో జిల్లా ప్రజలు బాధపడుతుంటే..దానికి తోడు వంటనూనె ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటరు వంట నూనైపె సగటున రూ.6 నుంచి రూ.10 వరకు పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

ధరల మంటకు కారణాలు ఇవే..

వంట నూనెల ధరలు ఆకాశాన్నంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా వంట నూనెల సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్‌ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండగల సీజన్‌ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, పాత స్టాక్‌ను గోదాముల్లో బ్లాక్‌ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్‌ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు, విజిలెన్స్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడటం విమర్శలకు తావిస్తోంది.

ధరల మోత.. తూకంలో కోత

ఒకవైపు ధరలు పెంచుతున్న కంపెనీలు, మరోవైపు ప్యాకింగ్‌ విషయంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా వినియోగదారులు నూనె ప్యాకెట్‌ కొనేటప్పుడు ధరను గమనిస్తారే తప్ప, అందులో ఎంత పరిమాణం ఉందనేది నిశితంగా చూడరు. ఇదే అదనుగా పలు కంపెనీలు లీటరు ప్యాకెట్‌లో ఉండాల్సిన 910 గ్రాములకు బదులుగా కేవలం 850 గ్రాములు లేదా 800 గ్రాముల నూనెను మాత్రమే నింపి మార్కెట్లోకి వదులుతున్నాయి. అంటే పరోక్షంగా ప్రజలు తక్కువ నూనెకు ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. వ్యాపారులు సాగిస్తున్న ఈ దందాపై అధికారులు తక్షణమే స్పందించి, బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు.

సలసల కాగుతున్న నూనెల ధరలు

రూ.6 నుంచి రూ.10 వరకు పెంపు

వినియోగదారులపై పెరగనున్న భారం

రేట్లు పెంచుతున్న వ్యాపారులు

మరో వైపు గ్యాస్‌ కొరతతో అల్లాడుతున్న ప్రజలు

పెరిగిన ధరల వివరాలు (సుమారుగా)

నూనె రకం గతంలో ధర ప్రస్తుత ధర

(కిలో/లీటర్‌) రూ.లలో రూ.లలో

సాధారణ వంట నూనెలు 90 – 160 125 – 210

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ (ఫ్రీడమ్‌ తదితర) 140 – 160 166 – 178

పామాయిల్‌ 90 – 115 120 – 140

వేరుశెనగ నూనె 190 – 210 190 – 210

(స్థానిక ఉత్పత్తి కావడంతో పెద్దగా మార్పు లేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement