చోడవరం: మండల కేంద్రం చోడవరం పరిసరాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ఈదురుగాలుల బీభత్సానికి మామిడి, జీడిమామిడి కాయలు నేలరాలాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో చోడవరం, పరిసర గ్రామాల్లో అంధకారం అలుముకుంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు, చోడవరం పట్టణంతోపాటు వెంకన్నపాలెం, గోవాడ పరిసరాల్లో హోర్డింగ్‌లు, కటౌట్లు నేలకొరిగాయి. ఈదురు గాలులు భారీగా వీయడంతో ఇప్పుడిప్పుడే పిందె దశనుంచి కాయదశకు వస్తున్న మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. అసలే కాపు సరిగా లేదని ఆవేదన చెందుతున్న మామిడి రైతులకు ఈ భారీ వర్షం కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో పక్క జీడిమామిడి పంట కూడా నష్టం జరిగింది. ప్రస్తుతం పిక్క ముదురుతున్న దశలో ఈ పంట ఉంది. గాలీవాన కారణంగా పిక్క పండకుండానే రాలిపోయింది. మరోపక్క వేసవి ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత ఎక్కువ అవుతుండడంతో సతమతమవుతున్న జనానికి వర్షం ఊరటనిచ్చింది. చోడవరం పరిసరాల్లో సుమారు 20మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఎడతెరిపిలేకుండా కుండపోతగా వర్షం పడడంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మాడుగుల: మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నువ్వు చేలు నేలకొరిగాయి. మామిడి, చింత కాయలు రాలిపోయాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. నాలుగు వేల ఎకరాల్లో నువ్వు చేలు, రెండు వేల ఎకరాల్లో మినుము పంటకు నష్టం జరిగిందని అన్నదాతలు తెలిపారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని వారు కోరారు. విద్యుత్‌కు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో పలు దుకాణాలు ముంపునకు గురయ్యాయి.
బుచ్చెయ్యపేట: మండలంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో మామిడి, జీడిమామిడి కాయలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీఎన్,ఆర్టీ రోడ్డులో చెట్లు కూలిపోగా స్థానికులు వాటిని తొలగించి రాకపోకలు సాగేలా చేశారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంగారుమెట్ట,ఎల్‌బీ పురం,వడ్డాది,చిన అప్పనపాలెం, బుచ్చెయ్యపేట,దిబ్బిడి తదితర గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి.సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు అంధకారంలో అలమటించారు. గాలి వర్షంతో పలువురు ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు.
భారీగా పడిన వడగళ్లు
దేవరాపల్లి: మండలంలోని తిమిరాంలో శుక్రవారం సాయంత్రం భారీగా వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం భారీగా పడిన వడగళ్లు బీభత్సం సృష్టించాయి. వడగళ్లను చూసిన స్థానిక ప్రజలు, చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ వడగళ్ల వాన రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూత, పిందె దశలో ఉన్న జీడి, మామిడికి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుందని వాపోయారు. కూరగాయల పంటలపై వడగళ్లు పడటంతో దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడటంతో మండల కేంద్రం దేవరాపల్లి సహా పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


