రావికమతం: సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి, కొరత లేదంటూ అధికారులు ఓ వైపు చెబుతున్నా, క్షేతస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సమయానికి గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్రామాలకు సక్రమంగా గ్యాస్ సరఫరా కావడం లేదు. శుక్రవారం మండలంలో పలు గ్రామాల ప్రజలు రావికమతం గ్యాస్ గోడౌన్ వద్దకు వచ్చి సిలిండర్లకోసం ఎగబడ్డారు. ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రావికమతం చెరకు కాటా వద్ద మధ్యాహ్నం వరకు గ్యాస్ రాకపోవడంతో ఎండలో నిల్చోలేక గ్యాస్ సిలిండర్లను క్యూలైన్లో ఉంచారు. జనం ఎక్కువగా రావడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గ్యాస్ సరఫరా చేపట్టారు. 1,500 మంది బుక్ చేసుకోగా, 340 మందికి మాత్రమే గ్యాస్ సరఫరా చేశారు. దీంతో మిగిలిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


