నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్, బల్క్‌డ్రగ్‌పార్క్ నిర్మాణాల కోసం భూములు, నివాసప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా స్టీల్ ప్టాంట్ నిర్మాణానికి భూమి పూజ చేస్తుండడం సిగ్గుచేటని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం అన్నారు. మండలంలో బోదిగల్లంలో స్టీల్‌ప్లాంట్‌నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులను మోసం చేసిందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కిందని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. రూ.25 లక్షలకు బదులు కేవలం రూ.9లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొందని చెప్పారు. బలవంతంగా నిర్వాసితులను ఇళ్లను ఖాళీ చేయించి, ఆగమేఘాల మీద వాటిని తొలగించారన్నారు. ఇళ్లను ఖాళీ చేయించడంలో ఉన్న శ్రద్ధ ప్యాకేజీ చెల్లించడంలో లేదన్నారు. నిర్వాసితులు నిర్మించుకునే ఇళ్లకు సిమెంట్,ఐరన్,ఇసుక, ఇటుకలు సబ్సిడీపై ఇస్తామని పునాదులు నింపుకోడానికి గ్రావెల్ ఉచితంగా ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఇంటినిర్మాణ సమయంలో విద్యుత్ ఉచితంగా ఇస్తామని మోసం చేశారన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు మాట్లాడుతూ పునరావాస కాలనీల్లో విద్య,వైద్యం, తాగునీరు, తదితర 32 రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే, ఇళ్లను ఖాళీ చేయించాలన్నారు.ఇవేమీ కల్పించకుండానే ఖాళీ చేయించారన్నారు.వివాహమైన ఆడపిల్లకు, మేజర్లు అయిన ఆడపిల్లలకు ఆర్ అండ్‌ఆర్‌ప్యాకేజీ చెల్లించలేదన్నారు. స్థానికులకు, నిర్వాసితులకు కంపెనీల్లో 75శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.రా జేష్, సత్యనారాయణ,మహేష్ పాల్గొన్నారు.


