అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కొత్తపెంట
దేవరాపల్లి: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కొత్తపెంట గ్రామం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పంచాయతీ భవనం లేక గతంలో పాత సామాజిక భవనంలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితి నుంచి...నేడు కార్పొరేట్ భవనాలను తలపించేలా ఒకే చోట గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మించడంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో సుమారు రూ. 4.50 కోట్లతో అభివృద్ధి పనులు, రూ. 14 కోట్ల మేర సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులకు అందించారు. వెరసి గ్రామంలో నలువైపులా తారురోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో గ్రామం సర్వాంగ సుందరంగ దర్శనమిస్తోంది. మండలానికి శివారున ఉన్న కొత్తపెంట గ్రామస్తులు ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రం దేవరాపల్లి వెళ్లి అష్టకష్టాలు పడేవారు. వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గ్రామం నడిబొడ్డున రూ. 40 లక్షలతో అధునాతన హంగులతో గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించడంతో ప్రజల చెంతనే అన్ని సేవలు అందుతున్నాయి. గతంలో అనారోగ్యం వస్తే వైద్యం కోసం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవారు. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రూ.20 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నిర్మించడంతో గ్రామంలోనే నిత్యం వైద్య సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లి వెళ్లి నానా అవస్థలు పడేవారు. ఊరిలోనే రూ.20 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించి తద్వారా ఎరువులు, విత్తనాలు అందజేసి రైతుల కష్టాలు తీర్చి రైతు పక్షపాతిగా జగన్‌మోహన్‌రెడ్డి ముద్ర వేసుకున్నారు. నాడు–నేడులో రూ.19.35 లక్షలతో స్థానిక ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ఆధునికీకరించి మౌలిక సదుపాయల కల్పించి, మరో రూ. 11.25 లక్షలతో ప్రహారి నిర్మించారు. జల్‌జీవన్ మిషన్ స్కీమ్‌లో రూ. 1.07 కోట్లతో కొత్తపెంట, కొత్తూరులో రెండు మంచినీటి ట్యాంక్‌లు నిర్మించి, ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసి తాగు నీటి సమస్య నుంచి విముక్తి కల్పించారు.
చేపట్టిన మరిన్ని అభివృద్ధి పనులు
సుమారు రూ. 74 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 10 లక్షలతో సీసీ డ్రైనేజీలు, కొత్తపెంట నుంచి ఎన్.జి. నగరానికి రూ. 1.23 కోట్లతో తారు రోడ్డు, రూ. 36 లక్షల వ్యయంతో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, రూ. 20 లక్షలతో రెండు సామాజిక భవనాలు నిర్మించారు. రూ. 5 లక్షలతో మహిళా మండలి భవనం, రూ. 4 లక్షలతో శ్మశానంలో దహన వాటిక నిర్మించారు. కేవలం మూడు వేల జనాభా కలిగి, కుగ్రామాన్ని తలపించే కొత్తపెంట అప్పటి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సహాయ సహకారాలతో ఇప్పుడు పట్నాన్ని తలపిస్తుదంటే అతిశయోక్తి లేదు.
అన్ని సౌకర్యాలు, సేవలు సమకూరాయి
మా గ్రామం మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉండంతో గతంలో చిన్నపాటి ప్రభుత్వ సేవల కోసం దేవరాపల్లి వెళ్లి నానా అవస్థలు పడేవారం. మండల కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజంతా పనులు మానుకోవాల్సి వచ్చేది. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడంతో గ్రామంలోనే ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయి. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు దేవరాపల్లి వెళ్లి రోజంతా మండుటెండలో నరకయాతన పడేవారు. జగనన్న దయతో గ్రామ పొలిమేర దాటే పరిస్థితి లేకుండా ప్రస్తుతం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. ఆరోగ్యం బాగోకపోతే గతంలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందేవారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్‌లో నిత్యం 20 నుంచి 30 మందికి ఆస్పత్రి మాదిరిగా వైద్య సేవలు అందిస్తున్నారు. అప్పటి సీఎం జగన్, అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవ చూపించి సుమారు రూ.4.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. గ్రామస్తులకు రూ. 14 కోట్ల మేర సంక్షేమ పథకాల రూపంలో అందించారు. సర్పంచ్‌గా నా హయాంలో గ్రామం ప్రగతి బాట పట్టడం ఆనందంగా ఉంది. నాలుగైదు దశాబ్దాలలో జరగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేసి చూపించిన మాజీ సీఎం జగన్‌కు, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు తామంతా రుణపడి ఉంటాం.
–రొంగలి వెంకటరావు,
సర్పంచ్, కొత్తపెంట,
దేవరాపల్లి మండలం
ఊరు మారింది..
జగనన్న పాలనలో
మారిన కొత్తపెంట రూపురేఖలు
ఒకే చోట సచివాలయం, ఆర్బీకే,
విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు
నలువైపులా తారురోడ్లు, సీసీ రోడ్లు,
డ్రైనేజీల నిర్మాణం
సర్వాంగ సుందరంగా
దర్శనమిస్తున్న కొత్తపెంట
గత ఐదేళ్లలో రూ.4.50 కోట్లతో
అభివృద్ధి పనులు
గ్రామస్తులకు రూ. 14 కోట్ల మేర
సంక్షేమ లబ్ధి
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కొత్తపెంట
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కొత్తపెంట


