వాహనదారులసహనానికి ‘పరీక్ష’
సాక్షి, అనకాపల్లి : మూడు జిల్లాల నుంచి వచ్చే సరకు రవాణా వాహనదారులు సామర్థ్య పరీక్షలు (ఫిట్‌నెస్ సర్టిఫికెట్)కు కోసం బారులు తీరుతున్నారు. మూడు జిల్లాలకు అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలం దేవీపురంలో ఉన్న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లోనే సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు అంతటికీ ఒకే ఒక్క కేంద్రం ఉండడంతో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సబ్బవరం మండలం దేవీపురం వద్ద వున్న ఈ కేంద్రానికి సమీపంలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు బారులుతీరి కనిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) కోసం యజమానులు/ డ్రైవర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. ఆటోలు, లారీలు, బస్సులు, వ్యాన్లు వంటి వాహనాలను కొనుగోలు చేసిన ఎనిమిది సంవత్సరాల లోపు అయితే రెండేళ్లకు ఒకసారి, ఎనిమిదేళ్లు దాటితే ఏటా ఒకసారి ఫిట్‌నెస్ టెస్టింగ్ చేయించుకోవాలి. సరకు రవాణా వాహనాలతో పాటు ప్రయాణికులను తీసుకెళ్లే వివిధ రకాల వాహనాలు, విద్యా సంస్థలకు చెందిన బస్సులు, వ్యాన్లకు నిర్ణీత కాలంలో సామర్థ్య పరీక్షలు (ఫిట్‌నెస్ సర్టిఫికెట్) తప్పనిసరిగా నిర్వహించాలి.
సర్వర్ మొరాయింపుతో నిరీక్షణ
ఏడాదిన్నర క్రితం వరకు వాహనాల ఎఫ్‌సీ (ఫిట్‌నెస్ సర్టిఫికెట్)లు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ జారీ చేసేవారు. దీనివల్ల వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి ఫిట్‌నెస్ టెస్టింగ్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. జిల్లాకు ఒకటి చొప్పున ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లను ఏర్పాటు చేశారు. అనకాపల్లి– ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం శివారు దేవీ పురం టోల్ ప్లాజాకు సమీపంలో ఏటీఎస్ ఉంది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏటీఎస్‌లను ఏర్పాటు చేయకపోవడంతో ఈ రెండు జిల్లాల వాహనాలకు కూడా సబ్బవరం మండలంలోని ఏటీఎస్‌లో ఎఫ్‌సీ జారీ చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో ఉమ్మడి విశాఖపట్నంతోపాటు సరకు లోడింగ్/అన్‌లోడింగ్ నిమిత్తం విశాఖ నగరానికి వచ్చే ఇతర జిల్లాల వాహనాలు కూడా ఎఫ్‌సీల కోసం సబ్బవరం ఏటీఎస్‌లో స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఫిట్‌నెస్ పరీక్షలకు వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో వాహనాలను జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలుపుదల చేస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. కొన్నిసార్లు రెండు, మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు యజమానులు/ డ్రైవర్లు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మరోవైపు ఏటీఎస్‌లో సిబ్బంది కొరత, రవాణా శాఖ సర్వర్ తరచూ మొరాయిస్తుండడం వంటి కారణాలతో ఎఫ్‌సీల జారీ ఆలస్యం అవుతున్నది.
ఆరు నెలలైనా..ఆచరణ లేదు..
సబ్బవరం మండలంలోని ఏటీఎస్‌పై ఒత్తిడి పెరగడంతో సర్సీపట్నంలో మరో ఏటీఎస్‌ను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులు ప్రతిపాదన చేశారు. ఆరు నెలల కిందట జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై మాట్లాడారు. ఏటీఎస్ సబ్బవరం మండలంలో ఉండడం వల్ల సర్సీపట్నం పరిసర ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల నర్సీపట్నంలో ఏటీఎస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి రవీంద్ర స్పందిస్తూ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామనని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇది జరిగి ఆరు నెలలు దాటినా మరో ఏటీఎస్ మంజూరు కాలేదు. మళ్లీ ఈ నెల 15వ తేదీన సోమవారం జరిగిన డీఆర్‌సీ సమావేశంలో కూడా ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఆరు నెలల కిందట జరిగిన డీఆర్‌సీ సమావేశంలో నిర్ణయించిందే ఆచరణలోకి రాలేదు. మరి నిన్న జరిగిన డీఆర్‌సీ సమావేశంలో నిర్ణయం మరి ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో వేచిచూడాల్సిందే. అప్పటి వరకూ వాహన యజమానులకు ఇబ్బందులు తప్పవు.
దేవీపురంలోని ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్
ఫిట్‌నెస్ పరీక్ష కోసం వచ్చిన వాహనం
వాహనాల ఫిట్‌నెస్ పరీక్ష కోసం
గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి
అనకాపల్లి–సబ్బవరం హైవే సర్వీసు రోడ్డుపై బారులు తీరుతున్న వాహనాలు
ఫిట్‌నెస్ పరీక్షతో పాటు ఎఫ్‌సీ జారీలో
తీవ్ర జాప్యం
వాహనాల యజమానులు,
డ్రైవర్ల పడిగాపులు
నర్సీపట్నంలో మరో ఏటీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
డీఆర్‌సీలో ఆమోదించినా
కార్యరూపం దాల్చని వైనం
వాహనదారులసహనానికి ‘పరీక్ష’


