పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల గోల్‌మాల్!
● ఖాతాదారుల సొమ్ము సొంతానికి
వాడుకున్న పోస్టుమాస్టర్
● లబోదిబోమంటున్న బాధితులు
● సస్పెన్షన్‌తో సరిపెట్టిన అధికారులు
నర్సీపట్నం : ఖాతాదారులు డబ్బులు చెల్లించారు..తమ దగ్గర ఉన్న పాస్ బుక్‌ల్లో జమైంది, కానీ అధికారిక ఖాతాలో జమ కాలేదు..అధికారులు గోల్‌మాల్ సొమ్ముకు సంబంధం లేదంటున్నారు...మరి తమ సొమ్ముకు సమాధానం చెప్పేది ఎవరని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తన ఖాతా నుంచి రూ.15 వేలు డ్రా చేస్తే రూ.5 వేలు ఇచ్చి, మిగిలిన రూ.10 వేలు ఇవ్వలేదని మన్యపురట్ల గ్రామానికి చెందిన నర్సే లక్ష్మి తెలిపింది. రూ.10 వేలు డ్రా చేస్తే రూ.2500 ఇవ్వలేదని అదే గ్రామానికి చెందిన నర్సే నాగేశ్వరరావు తెలిపారు. రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.7 వేలు ఇచ్చి, మిగిలిన రూ.3 వేలు ఇవ్వలేదని తోట శివ అనే ఖాతాదారు తెలిపారు. ఇలా పోస్టుమాస్టర్ చేతిలో మోసపోయి వెలుగులోకి రానివారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. నాతవరం మండలం, మన్యపురట్ల పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల వరకు నిధులు గోల్‌మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాతాదారులు చెల్లించిన నగదును పోస్టల్ అకౌంట్‌లో జమ చేయలేదు. ఈ విషయం అధికారుల విచారణలో రుజువు కావడంతో పోస్టుమాస్టర్ రావాడ సోమరాజును అక్టోబర్ 16న సస్పెండ్ చేశారు. బాధితులు రూ.7 లక్షలు అంటున్నారు.. కానీ అధికారులు సస్పెండ్ చేసిన నాటికి రూ.2 లక్షలు జమ కాలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి రూ.50 వేలు రికవరీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. బ్రాంచి పరిధిలో లింగంపేట, రాజుపేట అగ్రహారం, మన్యపురట్ల, గుర్రంపేట గ్రామాలు ఉన్నాయి. ఆర్‌డీ, ఎస్‌హెచ్‌ఏ, సేవింగ్ అకౌంట్స్, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి సుమారు 300 మంది ఖాతాదారులు ఉన్నారు. ఖాతాదారుల నుంచి కట్టిన నగదు ఏ రోజుకు ఆరోజు మెయిన్ బ్రాంచిలో జమ చేయాల్సి ఉంది. రోజుకు రూ.15 వేలకు మించి నగదు పోస్టుమాస్టర్ దగ్గర ఉండకూడదు. కానీ ఆయన రూ.లక్షలకు లక్షలు తన దగ్గర ఉంచుకుని సొంత అవసరాలకు వాడుకునేవారు. సస్పెన్షన్‌కు ముందు పోస్టల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో నగదు సొంత అవసరాలకు వాడుకున్నట్టు రెండు పర్యాయాలు గుర్తించారు. అప్పట్లో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ తనిఖీలో నగదు వాడుకున్నట్టు మూడోసారి రుజువు కావడంతో సస్పెండ్ చేశారు. ఖాతాదారులను పిలిచి అధికారులు విచారించలేదు. పాస్‌బుక్, ఒరిజనల్ ఖాతాలో నగదుకు తేడా ఉండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా తమ ప్రాథమిక విచారణలో రూ.2 లక్షల వరకు వాడుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఖాతాదారులకు నష్టం జరగకుండా చూస్తామని, అన్ని కోణాల్లో ఇన్‌స్పెక్టర్ రమేష్ విచారణ చేస్తున్నారని తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తరువాత ఖాతాదారులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.


