నెలగంట మోగింది
నక్కపల్లి : ధనుర్మాసోత్సవాలు ప్రముఖపుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 1.24 గంటలకు ధనుర్లగ్నం ప్రవేశం ప్రారంభ సూచకంగా కొండపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్‌కి దేవస్థానం ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తిరుమంజనం, ప్రత్యేక అభిషేకాలు, విశేష ప్రసాద నివేదనలు, నిత్యార్చనలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలంకరణ చేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. మధ్యాహ్నం ధనుర్లగ్నలో గరుడాద్రిపై మూలవిరాట్‌కు ఎదురుగా ఉన్న మండపంలో ఘంటానాదం(నెలగంట) చేయడంతో ధనుర్మాసోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి వద్ద తిరుప్పళి్ౖలయెళ్లిచ్చై, తిరుప్పావై సేవాకాలము నిర్వహించిన తర్వాత నీరాజన మంత్రపుష్పం తర్వాత గోదాదేవి అమ్మవారి వ్రతదీక్షలో భాగంగా తిరుప్పావైలోని మార్గలిత్తింగల్ మదినిరైయింద నమ్మాళాల్ మొదటి పాశురంతో ప్రత్యేక నీరాజనాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం తీర్ధగోష్టి ప్రసాద వినియోగం జరిగింది. కొండదిగువన గల క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి సన్నిధిలోను ఉపాలయాల్లోను ప్రత్యేక ప్రసాద నివేదనలు చేసి స్వామివారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో మొదటి పాశురం విన్నపంతో నీరాజనాలు సమర్పించారు. గరుడ వాహనంపై శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి వారిని, పెద్ద పల్లకిలో గోదాదేవి అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు తొలిదర్శన మిచ్చారు.
ఘనంగా ప్రారంభమైన
ధనుర్మాసోత్సవాలు
ఉపమాక గరుడాద్రిపై ఘంటానాదం మోగించిన అర్చకులు
గోదాదేవికి తిరుప్పావై మొదటి పాశురం విన్నపం
గరుడవాహనంపై స్వామి దర్శనం
నెలగంట మోగింది


