క్షేత్రస్థాయిలో నేర్చుకోవడం ముఖ్యం
కశింకోట: వ్యవసాయ కళాశాల విద్యార్థులు పుస్తకాల్లో చదివి నేర్చుకున్న దానికంటే క్షేత్రస్థాయిలో నేర్చుకోవడం ముఖ్యమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సిహెచ్. ముకుందరావు తెలిపారు. ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మండలంలోని పల్లపు సోమవరం గ్రామంలో గురువారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతుల ద్వారా వ్యవసాయ పంటల సాగు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలన్నారు. ఇవి విద్యాభివృద్ధికి, భవిష్యత్‌లోను ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం సాగవుతున్న పంటల గురించి, లాభసాటి వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ దాడి ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ కె.వి. రమణమూర్తి, డాక్టర్ ఎం. రవిబాబు సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల రైతులకు గురించి వివరించారు. పంటలపై వచ్చే చీడపీడల నివారణకు తీసుకోవలసిన చర్యలు వివరించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. వ్యవసాయ అధికారి ఎం. స్వప్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో నేర్చుకోవడం ముఖ్యం


