ఆలయ భూమి ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు
చీడికాడ: మంచాలలో మోదకొండమ్మ ఆలయం స్థల ఆక్రమణపై గ్రామానికి చెందిన పాటూరి రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సర్వే నెంబర్ 117–3లో 32 సెంట్లు స్థలం ఆలయానికి చెందిందన్నారు. ఆలయానికి దక్షిణ దిశగా 10 అడుగుల స్థలం గుడి ప్రదక్షిణకు ఉందన్నారు. గ్రామానికి చెందిన పట్నాల తమన్నాచారి కబ్జా చేసి ఆక్రమించుకుని సిమెంట్ దిమ్మలతో ఫెన్సింగ్ వేసాడన్నారు. ఆలయం ముందున్న రెండు భారీ టేకు చెట్లు ఎటువంటి అనుమతి లేకుండా నరికివేసి తరలించారన్నారు. ఈ ఆక్రమణపై ఎవరైనా తమన్నాచారిని ప్రశ్నిస్తే దుర్భాషలాడడంతో పాటు షెంపీ సీఎం రమేష్ పీఏ తన బంధువని తనను ఎవరూ ఏం చేయలేరని బెదిరిస్తున్నాడని అన్నారు. ఈ ఆక్రమణపై చీడికాడ పోలీసులకు పిర్యాదు చేయగా, ఎస్‌ఐ బి.సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించినట్టు చెప్పారు. గుడి స్థలంలో గల ఆక్రమణలను తొలగించాలని, చెట్టు నరికినందుకు కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. దీనిపై ఎస్‌ఐ బి.సతీష్‌ను వివరణ కోరగా సంఘటన స్థలానికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తి వ్యక్తి వద్ద ఉన్న 12 సెంట్ల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించానన్నారు. ఈ సమస్యను పరిశీలించాలని రివెన్యూ అధికారులకు నివేదించడంతో పాటు ఇతర లింకు డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని ఆక్రమణదారు తమన్నాచారికి సూచించారు.


