ఏళ్లుగా శిథిలావస్థ..! ఏమిటీ దురవస్థ..!!
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిని ఆయకట్టు భూములకు ప్రవహించేందుకు పంట కాలువలు అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో పెద్దా చిన్న కాలువల మొత్తం 120 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేశారు. నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం, కోటనందూరు తుని, రౌతులపూడి మండలాల పరిధిలో సుమారుగా 197 గ్రామాల మీదుగా తాండవ కాలువలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులు, వాహనాలు రాకపోకలు సాగించేందుకు కాలువలపై తాండవ ప్రాజక్టు నిర్మాణ సమయంలో ఆర్‌అండ్‌బీ రోడ్లు పొంత రోడ్లపై సుమారుగా 85 పైగా వంతెనలు, కల్వర్టులు నిర్మించారు. అవి క్రమేపీ దెబ్బతిని రక్షణ గోడలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాతవరం మండలం జిల్లేడుపూడి ఎ.పి.పురం ఎం.బి.పట్నం నాతవరం గుమ్మడిగొండ గునుపూడి వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే మాదిరిగా కోటవురట్ల, నర్సీపట్నం మండలాలతోపాటు కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాల పరిధిలో పలు గ్రామాల్లోనూ వంతెనలు, కల్వర్టులు దెబ్బతిని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
● నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో తాండవ కాలువపై నిర్మించిన వంతెన పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. ఆ శిథిలమైన ప్రదేశంలో స్థానికులు తాత్కాలికంగా కర్రలు ఏర్పాటు చేశారు.
● గాంధీనగరం ఎం.బి.పట్నం, ఎ.శరభవరం, నాయుడుపాలెం, నాతవరం, చమ్మచింత, గుమ్మడిగొండ, గునుపూడి, పి.కె.గూడెం, శృంగవరం, పెద జగ్గంపేట, గన్నవరం, వై.బి.పట్నం గ్రామాల వద్ద తాండవ కాలువలపై వంతెనలు కూడా శిథిలమయ్యాయి.
● నర్సీపట్నం మండలం వేములపూడి, దుగ్గాడ, మెట్టపాలెం, మెండికండి, అమలాపురం, కోటవురట్ల మండలంలో పాములవాక, యరకన్నపాలెం, రామన్నపాలెం, కొత్తపల్లి జంగాలపాలెం, బోడపాలెం గ్రామాల పరిధిలో ఉన్నాయి.
● కోటనందూరు మండలం అల్లిపూడి ఎస్.ఆర్.పేట, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో శిథిలమైన వంతెనలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు వ్యవసాయ ఉత్పత్తులు తరలించాలన్నా, గ్రామస్తులు రాకపోకలు సాగించాలన్నా తాండవ కాలువలపై నిర్మించిన వంతెనలే ఆధారం. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వంతెనలు, కల్వర్టులు మరింత దెబ్బతిన్నాయి. కాలువలో నిండుగా నీరు ప్రవహిస్తుండగా, ఈ శిథిలమైన వంతెనల మీదుగా వాహనాలతో ప్రయాణాలు సాగించడానికి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై గత నెలలో తాండవ ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసేందుకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ దృష్టికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకెళ్లారు. కొన్ని చోట్ల తాండవ కాలువలపై, మరికొన్ని చోట్ల ఏలేరు కాలువలపై దెబ్బతిన వంతెనలు, కల్వర్టులను బాగు చేయాలని కోరడంతో ఆమేరకు హామీ ఇచ్చారు.
కాలం చెల్లిన కట్టడాలపై తీవ్ర నిర్లక్ష్యం
ప్రమాదకర స్థితిలో వంతెనలు, కల్వర్టులు
తాండవ నిర్మాణ సమయంలో
కట్టడాలు నేడు శిథిలం
రెండు జిల్లాల పరిధిలో 85 పైగా
వంతెనలు, కల్వర్టులు
వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు ప్రధాన మార్గాలు
నిత్యం వందలాదిగా ప్రజల రాకపోకలు
ఏళ్లుగా శిథిలావస్థ..! ఏమిటీ దురవస్థ..!!


