నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవోగా యాళ్ల శ్రీధర్
నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న యాళ్ల శ్రీధర్
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారిగా యాళ్ల శ్రీధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో దానేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈవోగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
వైఎస్సార్ సీపీలో
పలువురి నియామకాలు
అనకాపల్లి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఇండుగుపల్లి దేముడుబాబు (పెందుర్తి), జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పాలిశెట్టి సురేష్‌రాజ్ (పెందుర్తి)లను నియమించారు. నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్సార్‌టీఎఫ్ ప్రెసిడెంట్‌గా రుత్తల రమణ, చోడవరం వైఎస్సార్‌టీఎఫ్ ప్రెసిడెంట్‌గా జుంజూరు అప్పారావులను నియమించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.
నిలిచిన సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదుతో దేవుడి భూముల్లో నిర్మిస్తున్న మెగా సోలార్ ప్లాంట్ నిర్మాణం నిలిపివేశారు. విలువైన దేవుడి భూములను కాజేసేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని, దేవదాయ శాఖ నుంచి అనుమతులు రాకుండానే స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడి అండతో నర్సీపట్నం నియోజకవర్గం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి దేవస్థానానికి సంబంధించి బలిఘట్టంలో ఉన్న సుమారు 31 ఎకరాల దేవుడి భూములను మెగా సోలార్ ప్రైవేటు సంస్థకు అప్పగించారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్నవరం దేవస్థానం అధికారులు ఇటీవల భూముల ను సందర్శించారు. అనుమతులు వచ్చే వరకు పనులు చేపట్టవద్దని మెగా సోలార్ ప్రైవేట్ సంస్థ వారిని ఆదేశించినట్లు తెలిసింది.


