రాజకీయ పాఠాలు
పాఠశాలల్లో
నర్సీపట్నం/పాయకరావుపేట: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ (పీటీఎం) విమర్శలకు తావిచ్చాయి. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సామర్థ్యం, సౌకర్యాలపై చర్చ జరిగేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు చాలాచోట్ల లక్ష్యానికి విరుద్ధంగా జరిగాయి. టీడీపీ నేతలకు అధికారులు ప్రాధాన్యమిచ్చారు. దీంతో సభలు టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని తలపించాయి. కొన్నిచోట్ల మొక్కుబడిగా నిర్వహించడంతో తమను ఎందుకు పాఠశాలలకు రప్పించారో తెలియక కొంతమంది తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. సకాలంలో ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న తీరు మరోసారి బహిర్గతమైంది. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్తు గురించి చర్చించాల్సిన పవిత్రమైన పాఠశాల వేదికలు.. అధికార పార్టీ ప్రచార అడ్డాలుగా మారిపోయాయి. గతంలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిని సరిదిద్దకపోవడంతో శుక్రవారం జరిగిన పీటీఎంలో అదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఈ సమావేశాలు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య జరగాలి. ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా టెంట్లు వేసి, వేదికలు సిద్ధం చేశారు. అయితే వేదికల మీద ఆశీనులవ్వాల్సిన తల్లిదండ్రుల కమిటీ సభ్యులను పక్కనపెట్టి.. స్థానిక టీడీపీ నాయకులకు, కూటమి నేతలకే అగ్రతాంబూలం దక్కింది.
టీడీపీ ప్రచార సభలా...
వేదికెక్కిన నాయకులు విద్యార్థుల క్రమశిక్షణ, విద్యాభివృద్ధికి సంబంధించిన సూచనలు ఇవ్వడం మానేసి, తమ పార్టీ గొప్పలు చెప్పుకోవడానికే సమయాన్ని వెచ్చించారు. మంత్రి లోకేష్ దయ వల్లే చదువులు సాగుతున్నాయంటూ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆకలేస్తోంది.. వదిలేయండి బాబోయ్ అని విద్యార్థులు దీనంగా చూసినా.. నాయకులు తమ ఊకదంపుడు ఉపన్యాసాలను కొనసాగించారు.
వెలవెలబోయిన సమావేశాలు
పలు చోట్ల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు రావ డానికి ఆసక్తి చూపలేదు. ఉపాధ్యాయులు పదే పదే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారి హాజరు అంతంత మాత్రంగానే ఉంది. నర్సీపట్నం టౌన్ జిల్లా పరిషత్ హైస్కూల్ (మెయిన్)లో జరిగిన పేరెంట్ మీటింగ్‌లో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. తల్లిదండ్రుల హాజరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి ఒక పూట గడపడానికి తల్లిదండ్రులకు తీరిక లేకపోతే ఎలా అని చురకలంటించారు. ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. విద్యార్ధులు తయారు చేసిన నమూనాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో సరిపెట్టారు. హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో జరిగిన పీఎంకు హాజరయ్యారు. ప్రతి శనివారం విద్యార్ధులకు నో బ్యాగ్ డేను ఉపాధ్యాయులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
నేలపైనే విద్యార్థులు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గినట్లు స్పష్టంగా కనిపించింది. నాయకులను పిలవకపోతే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో.. రెండు రోజుల ముందుగానే వారికి ఆహ్వానాలు పంపారు. దీంతో పాఠశాల వేదికలపై హెచ్‌ఎంలు, ఒకటి రెండు టీచర్లు మినహా.. మిగిలిన కుర్చీలన్నీ పచ్చ చొక్కాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇక వచ్చిన తల్లిదండ్రులకు అరకొర సౌకర్యాలే కల్పించారు. కొన్ని చోట్ల విద్యార్థులను నేలపైనే కూర్చోబెట్టారు. తాగడానికి మంచినీరు కూడా కరువైంది.
పేరెంట్స్ మీటింగ్‌ను
హైజాక్ చేసిన టీడీపీ
పిలిచింది తల్లిదండ్రులకు.. ప్రాధాన్యం తమ్ముళ్లకు!
రాజకీయ పాఠాలు
రాజకీయ పాఠాలు


