
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: అనకాపల్లి, విశాఖ జిల్లాలో వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల చార్జ్‌షీట్లను త్వరితగతిన దాఖలు చేయాలని, సాక్షులకు సమయానుసారం బ్రీఫింగ్ ఇవ్వాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. తన కార్యాలయంలో శనివారం కోర్టు కానిస్టేబుళ్లు, సీఎంఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులు, సమన్లు, నాన్–బెయిల్‌బుల్ వారెంట్లు, పీటీ కేసులపై కోర్టు కానిస్టేబుళ్లు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూసి, నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలన్నారు. సాక్షులు ఎటువంటి ఒత్తిడులు, ప్రలోభాలకు గురికాకుండా సమయానికి కోర్టులో హాజరు కావడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వచ్చేనెల 13న జరిగే లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. శిక్షల శాతం పెంపులో కోర్టు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, స్టేషన్ స్థాయిలో కోర్టు సంబంధిత సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు అందుబాటులో ఉండాలన్నారు. కేసుల పురోగతిని నిరంతరం అధికారులకు తెలియజేయాలని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 39 మంది నిందితులకు శిక్షలు పడ్డాయని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహనరావు, డీసీఆర్‌బీ సీఐ లక్ష్మణమూర్తి, సీఎంఎస్ ఎస్‌ఐ రమణయ్య పాల్గొన్నారు.