
రాగి సాగు.. ఇకపై బాగు
● గిరి రైతుల చెంతకు వేగావతి, ఇంద్రావతి రకాల కొత్త వంగడాలు ● పరిచయం చేయనున్న చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు ● క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ● సాగుకు అనుకూలించిన ఏజెన్సీ వాతావరణం ● పెరగనున్న సాగు విస్తీర్ణం
ఇంద్రావతి రాగులు పంట కంకి(ఫైల్)
చింతపల్లి: చిరుధాన్యాల పంటల్లో ఒకటైన రాగి (చోడి)ని మెట్ట ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు. పాడేరు డివిజన్‌లో ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో ఉండే ఈ పంట విస్తీర్ణం రానురాను తగ్గిపోతోంది. ఒకప్పుడు పాడేరు డివిజన్‌లో సుమారు 30 వేల హెక్టార్లకు పైగా సాగులో ఉండేది. ఇప్పుడు సుమారు 20 వేల హెక్టార్లకు తగ్గిపోయింది. దేశవాళీ రకాలను సాగు చేయడం వల్ల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఈ కారణంగానే సాగుపై గిరి రైతులకు ఆసక్తి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రాగి సాగుకు పూర్వ వైభవం తెచ్చేందుకు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త వంగడాలను రైతులకు పరిచయం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. వేగావతి, ఇంద్రావతి రకాలు ఏజెన్సీ ప్రాంతానికి అనువైనవిగా పరిశోధనల్లో గుర్తించారు.
● నదుల పేర్లతో ఉన్న వేగావతి,ఇంద్రావతి రకాలను రైతులకు అందజేసేందుకు తొలిగా విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంలో అధ్యయనం చేశారు. వీటిని అభివృద్ధి తరువాత ఈ రకాల దిగుబడులపై ఆర్‌ఏఆర్‌ఎస్‌లో సుమారు మూడేళ్లపాటు పరిశోధనలు చేశారు. ఇంద్రావతి రకంలో దిగుబడి ఆశాజనకంగా ఉన్నందున ఈ ప్రాంతానికి అనుకూలమని గుర్తించారు. సుమారు 115–120 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 14–15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంద్రావతిలో ఫింగర్, నెక్, లీఫ్, బ్లాస్ట్, స్టెమ్, బోర్, డౌని, మిల్డ్యూ, అపిడ్స్ వంటి రోగాలు, చీడపీడలను తట్టుకునే వ్యాధినిరోధక లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. గతేడాది పాడేరు ప్రాంతంలో పది మంది రైతుల ద్వారా ఈ రకాన్ని సాగు చేయించారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నట్టు నిర్థారణ అయింది. ఈ రకం విత్తనాలను గిరిజన ఉప ప్రణాళికలో పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నారు.
● వేగావతి రకం సుమారు 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గోధు మచ్చ తెగులు, శిలీంధ్రం/బాక్టీరియా వల్ల ఆశించే బ్యండెడ్ బ్లైట్‌ను తట్టుకుంటుంది. ఈ రకం కూడా ఏజెన్సీకి అనుకూలంగా గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంద్రావతి రకం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, పుదుచ్చేరితోపాటు ఉత్తర భారతదేశంలో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయని వారు వివరించారు. వేగవతి రకం సాగు చేస్తూ గుజరాత్,మహారాష్ట్ర ప్రాంతాల్లో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.
● ఇంద్రావతి, వేగావతి రకాల్లో మెరుగైన పోషకాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరన్, కాల్షియం, జింక్ పోషకాలు అధికంగా ఉన్నట్టు వారు తెలిపారు. మార్కెట్‌లో రాగి ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున ఈ రెండు రకాల సాగు ద్వారా గిరి రైతులు మంచి ఆదాయం పొందవచ్చని వారు చెబుతున్నారు.

రాగి సాగు.. ఇకపై బాగు

రాగి సాగు.. ఇకపై బాగు