
వాగు దాటితేనే చదువు సాగేది..
● ప్రమాదకరమైన వాగును దాటుతూ పాఠశాలకు..
● బూసిపల్లి, నీలమెట్ట, తోకచిలకగ్రామ విద్యార్థుల అవస్థలు
జి.మాడుగుల: మండలంలో బూసిపల్లి, నీలమెట్ట, తోకచిలక గ్రామాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సాహసం చేయాల్సి వస్తోంది. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరు ప్రతిరోజు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన పాఠశాలకు వస్తుంటారు. మార్గం మధ్యలోని కొంగవాగును ప్రమాదకర పరిస్థితుల మధ్య దాటాల్సి వస్తోంది. వర్షాకాలంలో వీరిని స్కూల్‌కు పంపేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో దగ్గరుండి వాగును దాటించి అవతలి ఒడ్డుకు చేర్చుతున్నారు. స్కూల్ ముగిసిన తరువాత సాయంత్రం మళ్లీ వాగు వద్దకు వచ్చి వారిని దగ్గరుండి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి కృష్ణాపురం– బూసిపల్లి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మించడమే కాకుండా వాగు పై కల్వర్టు ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలని మూడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.