ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌లు

Jul 25 2025 4:39 AM | Updated on Jul 25 2025 4:39 AM

ఒంటరి

ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌లు

మైనర్‌ సహా ముగ్గురు నిందితుల అరెస్టు, రిమాండ్‌

26 తులాల బంగారు నగలు, 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్‌ఫోన్ల స్వాధీనం

సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన పోలీసులు

కశింకోట: జిల్లాలో తొమ్మిది చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో మైనర్‌ సహా ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు నగలు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనకాపల్లి డీఎస్సీ ఎం. శ్రావణి వివరాలు వెల్లడించారు.

నర్సీపట్నంలో నివాసముండే తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కర్రి నానిరెడ్డి, ఎస్‌. రాయవరం మండలం వాకపాడు గ్రామానికి చెందిన సెలూన్‌ దుకాణం నిర్వాహకుడు తారుతురి రమేష్‌, మరో మైనర్‌తో కలిసి జిల్లాలో పలుచోట్ల చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు నానిరెడ్డి రాజమహేంద్రవరంలో చదువు మానేసి నర్సీపట్నం వచ్చి తన తండ్రి ముత్తారెడ్డితో గ్రామాల్లో తిరుగుతూ వాయిదాల పద్ధతిపై ప్లాస్టిక్‌ సామాన్లు విక్రయించేవాడు. అనంతరం నర్సీపట్నంలో హోం నీడ్స్‌ మెటల్‌ దుకాణం నడుపుతూ పూర్తిగా నష్టపోయాడు. దీంతో ఫైనాన్స్‌ చేసిన వారు నగదు కోసం గొడవ చేస్తుండటంతో వారి ఒత్తిడిని తట్టుకోలేక యూట్యూబ్‌ చానల్‌లో మహిళల మెడలో బంగారు ఆభరణాలు దొంగతనం చేసే వీడియోలు చూసి ప్రేరణ పొందాడు. మిగిలిన ఇద్దరు నిందితులతో కలిసి జిల్లాలోని ఐదు మండలాల్లో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో కశింకోటలోని భవానీకాలనీకి చెందిన భార్యాభర్తలు నడిచి వెళ్తుండగా, ఈ నెల 1న గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో నాలుగు తులాల బంగారు తాడును లాక్కొని పరారయ్యారు. ఈ విషయమై కేసు నమోదు చేసి సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు లక్ష్మణరావు, మనోజ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు డి. గోపి, బండారు శ్రీనివాసరావు, జి. శ్రీనివాసరావు, బి. మహేశ్వరరావు, బి. దిలీప్‌కుమార్‌ (ఐటీ కోర్‌ కానిస్టేబుల్‌ )లతో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు నిందితులను పట్టుకోవడానికి 23 రోజులపాటు శ్రమించారు. కశింకోట నుంచి నర్సీపట్నం వరకు సీసీ కెమెరాలను పరిశీలించిన మీదట వీడియో ఫుటేజ్‌ల ఆధారంగా చోరీకి పాల్పడిన నిందితులను తాళ్లపాలెం వద్ద పట్టుకున్నారు. దీనితోపాటు గతంలో కశింకోట మండలం నూతలగుంటపాలెం, మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం, యలమంచిలి మండలంలో తులసీనగర్‌, కృష్ణాపురం, ఎస్‌. రాయవరం మండలం దార్లపూడి, గోకులపాడు, జేవీ పాలెం గ్రామాలు, బుచ్చియ్యపేటలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలో బంగారు వస్తువులను తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ తుహీన్‌ సిన్హా, ఏఎస్పీ ఎల్‌. మోహనరావుల పర్యవేక్షణలో డీఎస్పీ శ్రావణి, సీసీఎస్‌ సీఐ అప్పలనాయుడుల ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో కశింకోట పోలీసులు ఈ కేసులను ఛేదించారు. ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయపడకుండా రోడ్లపై వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కోరారు. యువత చెడు వ్యసనాలను దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఐ స్వామినాయుడు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌లు 1
1/1

ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement