
ఆకలి కేకలు
● పురుగుల అన్నం పెట్టడంతో ఆగ్రహం ● అర్ధరాత్రి.. అర్ధాకలితో రోడ్డెక్కిన స్టూడెంట్స్ ● నిరసనతో అట్టుడికిన ఆంధ్ర విశ్వ విద్యాలయం ● అధికారుల హామీతో ఆందోళన విరమణ
ఏయూ విద్యార్థుల
ఆచార్యుల తీరుపై ఆగ్రహం
వీసీ విద్యార్థులతో చర్చిస్తున్న సమయంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఎన్. రాజు, దూరవిద్యా కేంద్రం మాజీ డైరెక్టర్ ఆచార్య విజయమోహన్, మహిళా వసతిగృహం చీఫ్ వార్డెన్ ఆచార్య పల్లవిల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు ఆచార్యులు విద్యార్థులతో వాగ్వాదానికి దిగుతూ.. ‘మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీదే గ్రూప్? మీ ఐడీ కార్డులు చూపించండి. వర్సిటీ విద్యార్థులు కాని వారిని అరెస్టు చేయండి.’ అని అనడంతో విద్యా ర్థులు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ‘మీ సిబ్బంది ఐడీ కార్డులు ఎక్కడ? వర్సిటీలోకి వస్తున్న ఇతరుల ఐడీ కార్డులు ఎందుకు అడగడం లేదు?’అని విద్యార్థులు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తామని బెదిరిస్తారా? అంటూ ఆ ముగ్గురు ఆచార్యుల వైఖరిపై నిరసన గళం విప్పారు. ఏ ఒక్క విద్యార్థిపైనా కక్షపూరిత చర్యలు తీసుకున్నా మళ్లీ నిరసనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. దీంతో వీసీ కలుగజేసుకుని.. శాంతించాలని విద్యార్థులను కోరారు.
రెండు వారాల్లో
పరిష్కారం.. వీసీ హామీ
విద్యార్థుల సమస్యలను విన్న వీసీ ఆచార్య రాజశేఖర్.. రెండు వారాల్లోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చా రు. నాణ్యమైన ఆహారం అందించేందుకు ‘ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేస్తామని, ఈ బృందం హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తుందని తెలిపారు. ప్రతి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు నియమిస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమస్యల పరిష్కారానికి వీసీ హామీ ఇచ్చినా విద్యార్ధులు శాంతించలేదు. ఆందోళన కొనసాగించడంతో ఆచార్య ఎం.వి.ఆర్.రాజు విద్యార్థులతో మాట్లాడారు. ‘ఆగస్టు 21లోగా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, నమ్మండి.’ అని విద్యార్థులను శాంతింపజేశారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.
మద్దిలపాలెం: ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం..’అంటూ ఆంధ్రా యూనివర్సిటీ అధికారుల నిరంకుశ వైఖరికి నిరసనగా విద్యార్థులు అర్ధాకలితో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి సైన్స్ విద్యార్థుల హాస్టల్స్(ఎస్1, ఎస్2) మెస్‌లో వడ్డించిన అన్నం, కూరలో రోకలిబండ, పురుగులు కనిపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. మూడు రోజుల కిందట చికెన్‌లో కూడా పురుగులు వచ్చాయని వారు ఆరోపించారు. ఇంత అధ్వానంగా భోజనాలు పెట్టడమేమిటంటూ ధ్వజమెత్తారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఏయూ ముఖద్వారం వద్ద బైఠాయించి ఆందోళన ప్రారంభించారు. అర్ధరాత్రి దాటినా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు.. రాత్రంతా అక్కడే జాగరణ చేసి నిరసన కొనసాగించారు. బుధవారం ఉదయం ఏయూలోని అన్ని వసతి గృహాలకు, తరగతి గదులకు ప్రదర్శనగా వెళ్లి తోటి విద్యార్థుల మద్దతు కూడగట్టుకున్నారు. అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన కొనసాగించారు. ‘ఏయూ అధికారుల నిరంకుశ వైఖరి నశించాలి’, ‘వీసీ డౌన్ డౌన్’, ‘పురుగుల అన్నం పెట్టినా పట్టించుకోని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వర్సిటీ సైన్స్ ప్రిన్సిపాల్ ఎం.వి.ఎన్.రాజు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థులు శాంతించలేదు. ఉపకులపతి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే తక్షణమే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ విద్యార్థుల వద్దకు వచ్చారు. వారితో పాటు నేలపై కూర్చుని సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
సమస్యల ఏకరువు
ఐదు నెలల కిందట రోడ్డెక్కి సమస్యలు విన్నవించినా ఇంతవరకు పరిష్కరించలేదని ఏయూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు వెంకటరమణ వీసీకి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
● మెస్‌లో నాణ్యత లేని, పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారు. ఇలా జరగడం ఇది రెండోసారి. మెస్‌లలో పరిశుభ్రత లేదు. నాసిరకం భోజనానికి భారీగా మెస్ బిల్లులు వసూలు చేస్తున్నారు.
● వసతిగృహాల కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలను, విద్యుత్ బిల్లులను మెస్ బిల్లుల్లో కలిపి విద్యార్థులపై మోపుతున్నారు. ఈ భారాన్ని యాజమాన్యమే భరించాలి.
● మహిళా వసతి గృహాల వద్ద రక్షణ లేదు. బయటి వ్యక్తులు ప్రాంగణంలోకి చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రహరీలు నిర్మించి, సెక్యూరిటీని పెంచాలి.
● విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ తరగతులు ప్రారంభం కాలేదు. గెస్ట్ అధ్యాపకుల రెన్యువల్ ప్రక్రియలో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నాం.
● ప్రతి వసతి గృహంలో రెండు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి, పరిశుభ్రమైన తాగునీరు అందించాలి. కిచెన్, డైనింగ్ హాళ్లను ఆధునికీకరించి, కొత్త మంచాలు, కుర్చీలు సమకూర్చాలి.
● వర్సిటీ సెమినార్ హాళ్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. డిస్పెన్సరీలో అన్ని మందులు ఉంచి, వైద్య సేవలు విస్తృతం చేయాలి. వెయిటింగ్ హాలు ఏర్పాటు చేయాలి. దూరవిద్యా కేంద్రాన్ని బలోపేతం చేయాలి. స్కాలర్‌షిప్‌లు సకాలంలో మంజూరు చేయాలి. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గ్రంథాలయ సేవలు మెరుగుపరచాలి. హాస్టళ్లలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఆకలి కేకలు

ఆకలి కేకలు

ఆకలి కేకలు

ఆకలి కేకలు