
గ్రావెల్ మాఫియా విశ్వరూపం
● అచ్యుతాపురం సెజ్ ప్రాంతం నుంచి భారీ ఎత్తున తరలింపు ● చోద్యం చూస్తున్న ఏపీఐఐసీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు ● మామూళ్లు ఇస్తున్నాం.. తమను ఎవరూ అడ్డుకోలేరని కూటమి నేతల బహిరంగ వ్యాఖ్యలు
ఏపీఐఐసీ అధికారులకు ముడుపులు...!
ఎటువంటి అనుమతులు లేకుండా.. అడ్డు అదుపు లేకుండా కొండలను పిండి చేసి మరి అక్రమ గ్రావెల్‌ను దోచుకుంటున్నా ఇటు ఏపీఐఐసీ అధికారులు.. అటు రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. ఇ టు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషి తం చేస్తున్నారు. ఏపీఐఐసీ అధికారులకు రోజుకు వేలల్లో ముడుపులు చెల్లించి గ్రావెల్‌ను దోచుకుంటున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అనుమతుల్లేకుండా ఎక్కడపడితే అక్కడ రాత్రింబవళ్లు తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమార్కులు కొండలను, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి కుబేరులైపోతున్నారు. ఎవరైనా స్థానికులు అడ్డగిస్తే వారిపై దురుసుగా వ్యవహరిస్తూ అక్రమ గ్రావల్, మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక స్థానికులెవరైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. నేరుగా వారికే సమాచారం ఇచ్చి నామమాత్రంగా తనిఖీలు చేయడానికి వస్తున్నారు. పట్టపగలే గ్రావెల్ కొండలను పిండి చేస్తున్నా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు.
మడుతూరులో పొక్లెయిన్ల సహాయంతో గ్రావెల్ తవ్వకాలు
సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్:
గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. అనుమతుల్లేకుండా ప్రభుత్వ ఆస్తులను గ్రావెల్ అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో గల మట్టిని అక్రమంగా దోచుకుంటున్నారు. కూటమి నేతల అండదండలతో రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఇష్టానుసారంగా గ్రావెల్, చెరువు మట్టిని తవ్వేస్తున్నారు. పొక్లెయిన్ల సహాయంతో యథేచ్ఛగా కొండలను సైతం పిండి చేస్తున్నారు. అచ్యుతాపురం సెజ్ పరిశ్రమలను ఆనుకుని ఉన్న గల మడుతూరు, ఇరువాడ, యర్రవరం, ఉప్పవరం, జగన్నాథపురం, నడింపల్లి గ్రామాల్లో ఉన్న చెరువులు, కొండల్లో గ్రావెల్, చెరువుమట్టిని మాయం చేస్తున్నారు. అనుమతుల్లేకుండా ఈ ప్రాంతాల నుంచి పొక్లెయిన్లతో తవ్వి గ్రావెల్, చెరువు మట్టిని కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు తరలిస్తున్నారు. అధికారులకు ముడుపులు చెల్లించి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఏపీఐఐసీ అధికారులకు రోజువారీ మామూళ్లు రూ. 50 వేలు ఇస్తున్నామని... తమను ఎవ్వరూ ఆపలేరంటూ బహిరంగంగానే కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి వ్యాఖ్యలకు తగ్గట్టు ఏపీఐఐసీ అధికారులు కూడా గ్రావెల్ అక్రమ రవాణాను పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. బుధవారం కూడా అచ్యుతాపురం మండలంలో ఏపీఐఐసీ భూముల్లో ఉన్న మడుతూరు కొండ, ఇండస్ట్రీయల్ చెరువుతో పాటు పలుచోట్ల నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించారు.
నెలకు రూ.6 కోట్ల విలువైన గ్రావెల్ దోపిడీ
అచ్యుతాపురం సెజ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గ్రావెల్ అవసరం ఉంది. ఏపీఐఐసీ భూముల్లో ఉండే ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి మరీ గ్రావెల్ మాఫియా దోచుకుంటోంది. రోజుకు సుమారుగా 200 లోడ్‌ల గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. పదుల సంఖ్యలో 12 టైర్ల లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. అంటే ఒక్కో లారీ రోజుకు 70 నుంచి 80 టన్నుల చొప్పున 200 ట్రిప్‌ల గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఒక్కో లారీ లోడ్‌ను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముకుంటున్నారు. అంటే రోజుకు రూ. 20 లక్షల విలువైన గ్రావెల్‌ను మాయం చేస్తున్నారు. అంటే నెలకు ఏకంగా రూ.6 కోట్ల విలువైన గ్రావెల్‌ను అక్రమార్కులు దోచుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ పరిశ్రమలకు స్థానికంగా తమ భూముల్లో నిర్మాణాలతో పాటు ఫిల్లింగ్‌కు గ్రావెల్ అవసరం ఎక్కువగా ఉంటోంది. ఈ అవసరాన్ని ఇప్పుడు కూటమి నేతలు జేబులు నింపుకునేందుకు వాడుకుంటున్నారు. తాము సరఫరా చేస్తేనే తీసుకోవాలనే నిబంధనతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ రవాణాను సాగిస్తున్నారు. ఇందులో అధికారులకూ వాటాలు అందుతుండటంతో వారు కనీసం ఫిర్యాదు కూడా చేయడం లేదనే విమర్శలున్నాయి.
అచ్యుతాపురం సెజ్ పరిసర ప్రాంతాల్లో గ్రావెల్‌ను చదును చేస్తున్న దృశ్యం

గ్రావెల్ మాఫియా విశ్వరూపం

గ్రావెల్ మాఫియా విశ్వరూపం