
రైతన్నను రోడ్డుపాలు చేయొద్దు
నిర్వాసిత గ్రామాల్లో కంచాలు వాయిస్తూ వినూత్న నిరసన
● రాత్రి సమయంలో అన్నదాతల ఆందోళన ● తక్షణం అదనపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్
నక్కపల్లి: పారిశ్రామికీకరణ పేరిట తమ భూములు లాక్కుంటే రోడ్డున పడతామంటూ నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు బుధవారం రాత్రి రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్టీల్‌ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గరిటెలతో కంచాలు వాయిస్తూ వినూత్నంగా ఆందోళన చేశారు. మూలపర, పాటిమీద, చందనాడ, బోయపాడు, రాజయ్యపేట తదితర గ్రామాల్లో రైతులు, నిర్వాసితులు వైఎస్సార్‌సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే కంపెనీలకు భూములు, నివాస ప్రాంతాలు త్యాగం చేసిన రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లయిన మహిళలు, పురుషులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని గత ఏడాది నుంచి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా బల్క్ డ్రగ్ పార్క్ పనులు ప్రారంభించడం తగదన్నారు. ఇప్పటికీ పట్టించుకోకపోతే ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించామన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్య పరిష్కరించకుండా బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనంగా మరో 800 ఎకరాలు, స్టీల్‌ప్లాంట్ కోసం మరో 2500 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను అదనపు భూసేకరణను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. హోంమంత్రి అనిత కూడా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని ఎన్నికల ముందు ప్రకటించి, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని రైతు నాయకులు ఆరోపించారు. వచ్చే నెల 6న తహసీల్దార్ కార్యాలయంలో జరిగే బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామన్నారు. పార్క్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని గ్రామాల్లోనే ఈ తరహా నిరసనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ తిరుపతిరావు, రైతు నాయకులు రావి అప్పారావు, తళ్ల అప్పలస్వామి, తాతారావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

రైతన్నను రోడ్డుపాలు చేయొద్దు