
మనకు వద్దు బిడ్డో మాయదారి స్మార్ట్ మీటరు..
● సీపీఎం ఇంటింటి ప్రచారం
అనకాపల్లి:
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా అధికారం చేపట్టిన తరువాత గృహాలకు అదాని స్మార్ట్ మీటర్లు బిగిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని, విద్యుత్ మీటర్లు పగలకొట్టాలని చెప్పి పిలుపునిచ్చారని, నేడు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కొత్తూరు పంచాయతీ ముత్రాస్ కాలనీలో అదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ మీటరు వాడటం వలన సెల్‌ఫోన్ మాదిరిగా ముందుగానే డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుందని, ఇంటికి వచ్చి రీడింగ్ తీసే పద్ధతి ఇక ఉండదన్నారు. ఆన్‌లైన్‌లోనే అదానీ కంపెనీ రీడింగ్ చూస్తుందని, ఆన్‌లైన్‌లోనే బిల్లు పంపుతారని ఆయన పేర్కొన్నారు. ముందుగా చెల్లించిన డబ్బులు అయిపోతుండగా మళ్లీ రీచార్జ్ చేయించుకోవాలని మెసేజ్ మాత్రం పెడతారని, ఆ మెసేజ్ చూసి, సకాలంలో డబ్బులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా ఆగిపోతుందన్నారు. విద్యుత్ డిమాండ్‌ను బట్టి పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, చలికాలం ఒక రేటు, వేసవికాలం మరొక రేటు, ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచే అవకాశం ఉంటుందన్నారు. నేడు ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీలు అడ్డుగోలుగా దోచుకుంటున్న మాదిరిగానే రానున్న రోజల్లో కరెంటు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. దేశంలోని వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని, విద్యుత్ రంగం మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని రాష్ట్రాలకు ఈమేరకు హుకుం జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీపీఎం నాయకులు కాళ్ల తాళయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.