
‘ఆడబిడ్డ నిధి’ ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర
దేవరాపల్లి: ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగ్గొట్టి మహిళలను మోసగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శించారు. తారువలో బుధవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ‘ఆడ బిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు అధికార దాహంతో హామీలిచ్చి గద్దెనెక్కాక నమ్మి ఓట్లేసిన మహిళను నిలువునా మోసగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. మంత్రి మాటలతో మహిళల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. కూటమి నాయకులు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల పేరిట మేనిఫెస్టోను ప్రకటించి, బాండ్లు సైతం రాసిచ్చి అమలు చేయకుండా ఎగ్గొట్టడం సరికాదన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీనీ కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అమలు చేశారని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ అప్పులు చేస్తున్నారని చంద్రబాబు సహా కూటమి నాయకులు దుష్ప్రచారం చేశారని, నాడు జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల రూపంలో ప్రజలకు మేలు చేశారని గుర్తు చేశారు. నేడు అంతకు మించి అప్పులు చేసి కూడా సంక్షేమం, అభివృద్ధి చేయకుండా కూటమి నాయకులు ఆ సొమ్మును ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలిపాలని డిమాండ్ చేశారు.