
ఇష్టం లేని పెళ్లి.. వివాహిత ఆత్మహత్య
యలమంచిలి రూరల్: తల్లిదండ్రులు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంతో పట్టణంలోని పాతవీధిలో సలాది రూప (21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక చేతిలో బిడ్దను పెట్టుకుని తల్లి బలన్మరణానికి పాల్పడడం స్థానికులను కలచివేసింది. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ధనుంజయరావు పరిశీలించారు. పట్టణ ఎస్సై కె.సావిత్రి అందజేసిన వివరాలివి.. రాంబిల్లి మండలం పెదకలవలాపల్లికి చెందిన సలాది రూపను నాలుగేళ్ల క్రితం యలమంచిలి పట్టణం పాతవీధికి చెందిన గుంటుకు రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. మొదట్నుంచి రూపకు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టం లేదు. రూప తరచూ తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పి బాధపడుతూ ఉండేది. అత్తింటివారు తనను బాగా చూసుకుంటున్నా మానసికంగా తాను ఇబ్బంది పడుతున్నట్టు చెబుతుండేదని మృతురాలి తల్లి నూకరత్నం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు అల్లుడు రాజు, ఇతర కుటుంబసభ్యులు తనకు తెలియజేశారని, విషయం తెలుసుకుని బంధువులతో కలిసి యలమంచిలి వచ్చామని, ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని మృతురాలి తల్లి నూకరత్నం తెలిపారు. అత్తింటివారిపై ఎలాంటి అనుమానం లేదని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై సావిత్రి మీడియాకు తెలిపారు.