
‘ఇసుక దందా’పై అధికారుల దాడులు
కోటవురట్ల: ‘హోం మంత్రి ఇలాకాలో.. ఆగని ఇసుక దందా’శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించారు. వరహనదిని పరిశీలించి పలు ప్రాంతాలలో ఇసుక నిల్వలపై దాడులు చేశారు. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గాడి కొట్టించారు. తహసీల్దారు తిరుమలబాబు మాట్లాడుతూ సాక్షిలో వెలువడిన కథనంతో పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో గొట్టివాడకు చెందిన సుంకర నూకినాయుడు(బాబ్జీ) అనే వ్యక్తికి చెందిన సర్వే నంబరు 921 జిరాయితీ మెట్టభూమి మామిడి తోటలో రెండు ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇసుక నిల్వలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించామన్నారు. రాత్రి వేళల్లో సమీపంలోని వరాహనదిలో నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి ఎడ్ల బళ్ల ద్వారా మామిడి తోటల్లోకి తరలించి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. ఇదే సర్వే నంబరు మామిడి తోటలో గతంలో కూడా అనేక సార్లు అక్రమ ఇసుక నిల్వలు గుర్తించి హెచ్చరించామన్నారు. ఈ మేరకు 92/1 సర్వే నంబరు జిరాయితీ మెట్ట భూమి యజమాని సుంకర నూకినాయుడుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. విచారణలో గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టరుకు నివేదిక సమర్పిస్తున్నట్టు చెప్పారు. గొట్టివాడ పరిధిలో వరాహనదిలోకి వెళ్లకుండా ట్రెంచ్ కొట్టించి రెవెన్యూ అసిస్టెంట్లను కాపలా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రమేష్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.

‘ఇసుక దందా’పై అధికారుల దాడులు