
బల్క్‌డ్రగ్‌పార్క్‌కు అదనంగా భూములు
● 790 ఎకరాల సేకరణకు
కేబినెట్ ఆమోదం
● రైతుల నుంచి వ్యతిరేకత
నక్కపల్లి: మండలంలో ఏర్పాటు కానున్న బల్క్‌డ్రగ్ పార్క్‌కు అదనంగా భూములు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 790 ఎకరాలు సేకరించేందుకు బుధవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం రెండు వేల ఎకరాలు కేటాయించింది. నక్కపల్లి మండలంలో విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా వేంపాడు, చందనాడ, రాజయ్యపేట, డిఎల్‌పురం, అమలాపురం, గ్రామాల్లో 4,500 ఎకరాలు సేకరించిన విష యం తెలిసిందే. వీటిలో బల్క్‌డ్రగ్ పార్క్ కోసం గత ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఎకరాలను కేటాయించారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో మరో 2,400 ఎకరాలను ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించారు. బల్క్‌డ్రగ్‌పార్క్‌కు మరో 790 ఎకరాలు అవసరం కానుంది. దీంతో పెదతీనార్లలో 600 ఎకరాలు, సీహెచ్‌ఎల్‌పురంలో 190 ఎకరాలు సేకరించేందుకు ఏపీఐఐసీ నిర్ణయించి ఈమేరకు ప్రభుత్వ ఆమోదానికి పంపింది. బుధవారం జరిగిన కేబినెట్‌సమావేశంలో ఈ భూములు సేకరించేందుకు ఆమోదం తెలిపింది. రైతులంతా భూములు ఇచ్చేందుకు తీవ్రవ్యతిరేకత చూపుతున్నారు. రైతుల నిరసన, ఆందోళన పట్టించుకోకుండా మంత్రిమండలి భూసేకరణకు అమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు రూ.37 లక్షలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. భూసేకరణకు రైతులు ససేమిరా అంటున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా డైరెక్ట్ పర్జేజ్‌పేరుతో రైతులనుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇలా కొనుగోలు చేస్తే రైతులకు కేవలం నష్టపరిహారం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు. భూములిచ్చిన రైతులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకింద రూ.25 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు.2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.