
నేడే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0
● బడి పండగకు ముస్తాబైన పాఠశాలలు, కళాశాలలు ● జిల్లాలో 2232 పాఠశాలలు, 134 జూనియర్ కళాశాలల్లో జరగనున్న కార్యక్రమాలు
అనకాపల్లి: జిల్లాలో పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు గురువారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు పండగ వాతావరణంలో జరుగుతుందని, జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించదానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా రెండో ఏడాది పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుగుతుందని, గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగిన ఈ కార్యక్రమాలు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో నిర్వహించడం విశేషమన్నారు. జిల్లా వ్యాప్తంగా 2232 పాఠశాలల నుంచి సుమారు 1,87,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి హాజరుకానున్నారు. జిల్లాలో 134 జూనియర్ కళాశాలల నుంచి 24,781 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా హాజరు కానున్నారని పేర్కొన్నారు. స్వయంగా విద్యార్థులే ఆహ్వానాలను అందించడం, ఆహ్వానం తో పాటు ఒక ఫార్మాట్‌ను కూడా ఇవ్వడం , తల్లిదండ్రులు ఆ ఫార్మాట్‌పై వారి అభిప్రాయాన్ని రాసి తిరిగి సమర్పించేలా రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో చర్చ జరుగుతుందన్నారు. టీచర్, స్టూడెంట్, పేరెంట్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి గత ఏడాది సాధించిన ప్రతిభను, ఈ ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందని ఆమె చెప్పారు.