
ప్రభుత్వం మారాక వేధింపులు మొదలయ్యాయి...
మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన
కోటవురట్ల: 15 ఏళ్లుగా ఇక్కడ వంట చేస్తున్నాం..ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. వంట ఏజెన్సీ ఎలాగూ మార్చేసుకున్నారు. మమ్మల్ని కూడా తీసెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు. మాకు మేము పని మానేయాలనే ఉద్దేశ్యంతో మాపై నిందలు వేస్తూ వేధిస్తున్నారు. ఆ నిందలు, తిట్లు భరించలేకపోతున్నాం.. ఇక ఇక్కడ పని చేయలేం అంటూ పాములవాకలోని కిల్లాడ రామ్మూర్తినాయుడు జెడ్పీ హైస్కూల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన చెందారు. విషయంలోకి వెళ్తే జెడ్పీ హైస్కూల్‌లో అదే గ్రామానికి చెందిన సుర్ల చంటి, మేడపరెడ్డి రాజు, కూండ్రపు సత్యవతి, ఇందల సన్యాసమ్మ మధ్యాహ్న భోజన పథకంలో 15 ఏళ్లుగా వంట కార్మికులుగా పని చేస్తున్నారు. అయితే కొద్ది కాలంగా తమపై వేధింపులు మొదలయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హెచ్‌ఎం లక్ష్మీనారాయణ తమను వినరాని విధంగా దూషిస్తున్నారని ఆరోపించారు. గుడ్లు, బియ్యం, పప్పులు అన్నీ లెక్కగా ఇస్తున్నా తాము దొంగతనం చేస్తున్నామని ఆరోపిస్తూ దారుణంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హెచ్‌ఎం లక్ష్మీనారాయణను వివరణ కోరగా పిల్లలకు పెడుతున్న గుడ్లు, అన్నం తక్కువ వస్తోందని, ఇదేంటని ప్రశ్నిస్తే తనపై తిరగబడుతున్నారని, వారిని దూషించలేదని చెప్పారు.