
వ్యవసాయ భూములు సెజ్‌కు ఇచ్చేది లేదు
● సీపీఎం నాయకులతో కలిసి ఆర్లి గ్రామస్తుల నిరసన
కె.కోటపాడు: మండలంలోని ఆర్లి గ్రామంలో వ్యవసాయ భూములను సెజ్‌కు కేటాయించొద్దని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డి.వెంకన్న తెలిపారు. మంగళవారం ఆర్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి స్థానిక సచివాలయం వద్ద సెజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెజ్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు రహస్య సర్వేలు చేపట్టడాన్ని వెంకన్న తప్పుబట్టారు. ఎస్‌ఈజెడ్‌కు స్థలం కేటాయింపులు ఏ జోన్ (రెడ్, ఆరెంజ్, గ్రీన్) కిందకు వస్తాయో..ముందుగా వివరించాలని కోరారు. కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు కాలుష్య రహిత జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం కాలుష్యమయ్యే పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని నమ్మించి విషం చిమ్మే కంపెనీలను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలను, పొలాలను నాశనం చేయొద్దన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు యర్రా దేముడు, గండి నాయినిబాబు, రొంగలి ముత్యాలనాయుడు, స్థానికులు ఆర్.ఎ.పాత్రుడు, రుత్తల గోవింద, బోళెం కాసుబాబు, ఎం.సోమేష్, నాగేష్, పైడిరాజు పాల్గొన్నారు.