
దేవరాపల్లి స్కూల్ మూసివేతకు కూటమి నేతల కుట్ర
● రూ.కోట్ల విలువు చేసే స్థలంపై కన్ను ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న
దేవరాపల్లి: స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో మెయిన్ స్కూల్ మూసివేతకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. కోట్ల విలువ చేసే పాఠశాల స్థలంపై కొందరు కూటమి నేతలు కన్నేశారని ఆరోపించారు. పథకం ప్రకారం 3,4,5 తరగతులను ఎస్సీ కాలనీలో పాఠశాలకు పంపించేసి, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మెయిన్ స్కూల్‌ను 1,2 తరగతులకే పరిమితం చేసి ఫౌండేషన్ స్కూల్‌గా మార్చేశారన్నారు. దీన్ని ఒకటి రెండేళ్లు పాటు కొనసాగించి పిల్లలు లేరన్న సాకుతో మూసి వేయా లని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. దీంతో పలువురు పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరుకుల కాలనీ, కొరుప్రోలు వీధి చెందిన 3,4,5 తరగతుల విద్యార్థులు రోజూ రానుపోను ఆటోకు రూ. 20 చెల్లించి ఎస్సీ కాలనీలో మోడల్ స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మెయిన్ స్కూల్‌ను బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్పు చేసి, పేద పిల్లల చదువులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.