ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు

Jun 28 2025 8:06 AM | Updated on Jun 28 2025 8:06 AM

ప్రాణ

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు

గుండె తరుక్కుపోయే కఠిన వాస్తవం.. చదువు కోసం చిన్నారులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రమాదకర ప్రయాణం.. పడవపై రైవాడ జలాశయం దాటి, కొండలు గుట్టల్లో నడిచి, పొరుగు జిల్లా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలల సాహస కృత్యం.. వారి దీనావస్థ కఠిన హృదయులను సైతం కదిలిస్తుంది.. గిరిజన ప్రాంతంలో పుట్టిన పాపానికి ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టం పగవారికి కూడా వద్దనిపిస్తుంది.

నాటు పడవలో.. బురదలో కాలినడకన రాకపోకలు

5 కి.మీ దూరంలో ఉన్న బడికి ప్రమాదకర ప్రయాణం

అనంతగిరి మండలం సొలబంగు బాలల అవస్థలు

దేవరాపల్లి మండలం తామరబ్బ పాఠశాలలో చదువు

గ్రామానికి రోడ్డు, బడి లేక చిన్నారుల ఇక్కట్లు

పిల్లలు ఇంటికి చేరుకునే వరకు భయాందోళనలో తల్లిదండ్రులు

దేవరాపల్లి:

రైవాడ జలాశయానికి ఆవల.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని గిరిజన ప్రాంతం ఉంది. పినకోట పంచాయతీ శివారు సొలబొంగు గ్రామానికి చెందిన బాలలు చదువు కోసం ప్రాణాలకు తెగించి, అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి, పాఠశాల లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన 12 మంది విద్యార్థులు దేవరాపల్లి మండల పరిధిలోని తామరబ్బ ఎంపీయూపీ పాఠశాలకు పడవపైన, కాలినడకన వచ్చి చదువుకుంటున్నారు. సొలబొంగు నుంచి తామరబ్బకు చేరుకోవాలంటే రెండు మార్గాలు. వీరభద్రపేట మీదుగా పొలాల గట్లపై జారు బురదలో సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాలి. వర్షం పడితే ఈ మార్గంలో రాకపోకలు సాగించడం కష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా సొలబొంగు నుంచి నాటు పడవపై రైవాడ జలాశయంలో సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రయాణించి, దేవరాపల్లి మండల పరిధిలోని లోవ ముకుందపురం గ్రామానికి చేరుకొని.. అక్కడి నుంచి మళ్లీ ఒక కిలోమీటరు మేర చెట్లు, పుట్టల గుండా కర్రలు చేత పట్టుకొని ప్రయాణించి తామరబ్బ పాఠశాలకు చేరుకోవాలి. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురవడంతో విద్యార్థులు పడవపైనే పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరభద్రపేట రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలిపివేయడంతో తమకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయని సొలబొంగు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామంలో 16 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 70 మంది వరకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తులు సైతం నిత్యావసర సరకుల కోసం పడవపైన, లేదా వీరభద్రపేట మీదుగా తామరబ్బ వైపునకు చేరుకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రామానికి చెందిన గర్భిణులు ఆసుపత్రికి చేరుకోవాలంటే సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని దేవరాపల్లి ఆసుపత్రే దిక్కు.

దారీ తెన్నూ లేదు

మా గ్రామానికి దారీ తెన్నూ లేదు. మా గ్రామంలో బడి లేక పిల్లల్ని దేవరాపల్లి మండలంలోని తామరబ్బ స్కూల్‌కు పంపిస్తున్నాం. నా కుమార్తె అంజలి 4వ తరగతి చదువుతోంది. సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పొలాల గట్ల మీదుగా తుప్పలు, డొంకలను దాటుకుంటూ నడిచి వెళ్తున్నారు. వర్షం కురిస్తే కాలినడక మార్గం బురదమయంగా మారుతుంది. ప్రభుత్వం స్పందించి మా పిల్లలు పడుతున్న కష్టాలను తీర్చాలి.

– దిప్పల దేముడుబాబు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు

ప్రభుత్వం స్పందించాలి

మాకు ఎలాగూ చదువు లేదు.. మా పిల్లలనైనా చదివించాలని ఆశ పడుతున్నాం. నా కూతురు శివజ్యోతి ఒకటో తరగతి చదువుతోంది. ప్రస్తుత వర్షాలకు వీరభద్రపేట మార్గం అడుగు తీసి అడుగు వేయలేని విధంగా బురదమయంగా మారింది. ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో నాటు పడవలపై పిల్లలను లోవ ముకుందపురం వరకు పంపిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి బడి, రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలి.

–గమ్మెల రాజు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు 1
1/4

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు 2
2/4

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు 3
3/4

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు 4
4/4

ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement