
గుడి,బడి ధ్యాసే లేదు..గల్లీగల్లీలో ‘బెల్ట్’ లొల్లి
గ్రామాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగుతోంది. గల్లీగల్లీలో మందు దొరుకుతోంది. అర్ధరాత్రి వరకూ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రేటు పెంచి అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో మద్యం బాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మరో వైపు గుడి, బడి సమీపంలో షాపులు నిర్వహిస్తుండడంతో పూటుగా తాగిన మందుబాబులు వీరంగం సృష్టిస్తూ విద్యార్థులను, భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
● విచ్చలవిడిగా మద్యం విక్రయాలు ● భయాందోళనలలో గొడిచర్లలో పాఠశాల విద్యార్థులు ● మామ్మూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు
నక్కపల్లి: కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులై పారుతోంది. ఇష్టానుసారం బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారు. బడి, గుడి అన్న ధ్యాసే లేకుండా ఎక్కడపడితే ఏర్పాటు చేసేస్తున్నారు. గొడిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు అతి సమీపంలో జగన్నాథపురం వెళ్లే రూట్లో బెల్టుషాపు ఏర్పాటు చేసి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. బెల్ట్‌షాపు ముందునుంచే జగన్నాథపురం, ముకుందరాజుపేట, దోసలపాడు, చీడిక , కొత్తూరు, రమణయ్యపేట, రేబాక,తిరుపతిపాలెం, గుల్లిపాడు గ్రామాలనుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ గొడిచర్ల పాఠశాలలో చదువుకుంటున్నారు.దాదాపు 800 మందికి పైగా విద్యార్థులు సుమారు 3నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలనుంచి గొడిచర్ల పాఠశాలకు కాలినడక, సైకిళ్లపై, ఆటోల్లో వస్తారు. ఈ మార్గంలో బెల్టు షాపు ఉండడంతో విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ బెల్టుషాపునకు సమీపంలోనే గ్రామ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినీవిద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బెల్టుషాపు పరిసరప్రాంతాలను వినియోగిస్తారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బెల్టుషాపు ముందునుంచే రాకపోకలు సాగించవలసి రావడంతో మద్యం మత్తులోఎవరు ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తారోనన్న భయంతో బాలికలు ఆందోళన చెందుతున్నారు. లైసెన్సు పొందిన దుకాణాల యజమానులే గ్రామాల్లో అమ్మకాలను పెంచడం కోసం బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని బెల్ట్‌షాపుల్లోను ఎంఆర్‌పీ కంటే రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ ఎంఆర్‌పీ రూ.100 ఉంటే గ్రామాల్లో బెల్టుషాపుల్లో రూ.150 వసూలు చేస్తున్నారు. బీరు బాటిల్‌కు రూ.50 నుంచి రూ.100 ఎక్కువ వసూలు చేస్తున్నారు.
ఉపమాక వెంకన్న ఆలయానికి వెళ్లే రోడ్డులో..
రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్న ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులోకూడా రెండు మద్యం దుకాణాలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విక్రయాలే కాకుండా షాపు వద్దే సేవించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ రహదారిలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని చూసి భక్తులు విస్తుబోతున్నారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ కలిగిన బార్ల వద్ద మాత్రమే మద్యం సేవించాల్సి ఉంటుంది.కానీ నక్కపల్లి మండలంలో షాపుల వద్ద ఎంచక్కా సకల సదుపాయాలు కల్పించి అక్కడే తాగే ఏర్పాట్లు చేస్తున్నారు.