
అరగంటలో దొరికిన సెల్ ఫోన్
కశింకోట: పోయిన అర్థ గంట వ్యవధిలోనే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కనుగొని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం.. స్థానిక కస్పావీధికి చెందిన విశారపు నాగరాజు పనికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతూ మార్గంమధ్యలో మంగళవారం సాయంత్రం సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారు. ఇది సుమారు రూ.20 వేల ఖరీదు కలిగిన ఒప్పొ సెల్‌ఫోన్. భార్య సరోజినితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ పోయిన విషయాన్ని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లోని ఐటీ కోర్ విభాగానికి సమాచారం అందించారు. అక్కడి సిబ్బంది సమన్వయం చేసుకొని టవర్ లొకేషన్ ఆధారంగా ఎస్‌ఐ లక్ష్మణరావు సిబ్బందితో వెళ్లి సెల్‌ఫోన్‌ను స్థానిక రౌతు వీధి ప్రాంతంలో నాలుగైదు ఇళ్లు పరిశీలించిన మీదట పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని బాధితులకు అప్పగించామని సీఐ తెలిపారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.