ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
నాతవరం : కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను యుద్ధ ప్రతిపాదికన అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఆందోళన చేపట్టారు. మొయిన్‌రోడ్డుపై ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా అందించాలన్నారు. తల్లికి వందనం, 50 ఏళ్లు దాటిన అందరికీ పింఛన్ల సదుపాయం కల్పించాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇతర సదుపాయాలు అమలు చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టడం అపాలన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంపై కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ ఎ,వేణుగోపాల్‌కు ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు గురుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాభవాని, మండల శాఖ అధ్యక్షుడు చిన్నంనాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు
సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయాలి
నాతవరంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం


