
గందరగోళంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ
● ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు
నర్సీపట్నం: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చాలా గందరగోళంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. నర్సీపట్నం వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బదిలీలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలంటే రేషనలైజేషన్ ప్రక్రియతో ముడి పెట్టకూడదని చెప్పారు. ఒకసారి రేషన్‌లైజేషన్ జరిగిన తర్వాత కనీసం ఐదేళ్ల వరకు ఉపాధ్యాయులను కదపకూడదన్నారు. ఐదేళ్ల తర్వాత మాత్రమే రేషన్‌లైజేషన్ ప్రక్రియ జరపాలని తెలిపారు. అలా అయితేనే విద్యార్థుల సంఖ్య పెంచే అవకాశం ఉపాధ్యాయులకు కలుగుతుందని చెప్పారు. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాలకు రెండు పాయింట్లు అదనంగా ఇవ్వాలన్నారు. 2021లో బదిలీపై వచ్చి 2025లో రేషన్‌లైజేషన్ గురైన ఉపాధ్యాయులకు కూడా పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాల ని కోరారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా డీఎస్పీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు సర్వీసు పాయింట్లు ఇవ్వాలన్నారు. బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్లో తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. నర్సీపట్నం మండలంలో ఫౌండేషన్ స్కూళ్లుగా ఉన్న శ్రీరాంపురం, గచ్చపు వీధి పాఠశాలలను తిరిగి బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి, ఆ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యాశాఖాధికారులను కోరారు. విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లా పీ ఆర్టీయూ అధ్యక్షుడు డి.గోపీనాఽథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు మడ్డు శ్రీను, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, రాష్ట్ర కార్యదర్శి జి.పి.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.