
ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం తగదు
● ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్
మునగపాక: కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం విచారకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇంటింటికీ రేషన్ అందించేలా ఎండీయూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తే, ఇప్పటి ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడడం సరికాదన్నారు.సీఎం చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి ఉంటే కేరళలో మాదిరిగా 16 రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి ఎండీయూ వ్యవస్థ కొనసాగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో 2027 వరకు ఒప్పందం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు రద్దు చేయడం తగదన్నారు.ప్రజలంతా కూటమి పాలన తీరును గమనిస్తున్నారని ఆయన తెలిపారు.