
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
అనకాపల్లి: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దేవరాపల్లి మండలం ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చౌడువాడ దేముడునాయుడిని మార్టూరు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మార్టూరు జంక్షన్ వద్ద ఇటీవల కాలంలో వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిగా గుర్తించామన్నారు. ఇతని వద్ద మొత్తం 5 కేసులలో చోరీకి గురైన 7.5 తులాల బంగారం, 28 తులాల వెండి వస్తువులు, కెనాన్ కెమెరా, రూ.1,500లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ, పగటి వేళ దొంగతనాలకు పాల్పడేవాడని ఆయన పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో నిందితుడు జులాయిగా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనై తన స్నేహితులతో కలసి ఈ చోరీలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు.
నర్సీపట్నం టౌన్ పీఎస్ పరిధిలో...
నర్సీపట్నంలోని శారదానగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న రాళ్లపల్లి వెంకట లక్ష్మి గృహంలో ఈనెల 16న చొరబడి, ఆమైపె దాడి చేసి, బంగారు, వెండి ఆభరణాలను అపహరించిన అదే గ్రామానికి చెందిన ఉలబాల విజయకుమార్, కెళ్ల సతీష్, పత్రి నారాయణమ్మలను నర్సీపట్నం మండలం బలిఘట్టం టి–జంక్షన్ వద్ద అరెస్టు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు ఆభరణాలు 10 తులాలు, బంగారు గొలుసు 3 తులాలు, బంగారు గాజులు 7 తులాలు, బంగారు ఉంగరం తులం, వెండి దీపం కుందులు 19.370 తులాలు ముగ్గురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (క్రైమ్) ఎల్.మోహనరావు, అనకాపల్లి ఇన్‌చార్జ్ డీఎస్పీ బి.మోహనరావు, అనకాపల్లి రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ జి.రవికుమార్, సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐలు పి.రమేష్, చోడవరం సీఐ పి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలే చోరీలు
నలుగురు నిందితుల అరెస్టు
7.5 తులాల బంగారం, 28 తులాల వెండి వస్తువులు స్వాధీనం