
ఉప మేయర్‌గా దల్లి ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ ఉప మేయర్‌గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. గోవిందరెడ్డి పేరును టీడీపీ నుంచి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి గోవిందరెడ్డికి నియామక పత్రం అందించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు.
ముందు జాగ్రత్త!
ఉప మేయర్ ఎన్నికలో సోమవారం నాటి సీన్ రిపీట్ కారాదని జాగ్రత్త పడ్డారు. అసంతృప్త సభ్యుల్ని ముందుగానే రప్పించి మేయర్ చాంబర్లో కూర్చోబెట్టారు. మేయర్ పీలా శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి లిస్ట్ ప్రకారం టిక్ పెట్టి మరీ సభ్యుల్ని కౌన్సిల్ హాల్లోకి పంపారు. ముందు రోజు డుమ్మాకొట్టిన వారికి బుజ్జగింపులు, తాయిళాలు అందినట్లు సమాచారం.
యాదవ, కాపులకు వెన్నుపోటు
జీవీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆ సామాజిక వర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మేయర్‌గా గొలగాని హరివెంకట కుమారి(యాదవ), ఉప మేయర్‌గా జియ్యాని శ్రీధర్(కాపు)లకు అవకాశం ఇచ్చారు. కౌన్సిల్లో బలం లేకపోయినా దొడ్డిదారిన వారిని దించేసిన కూటమి నేతలు, విశాఖలో కూటమి మనుగడకు కారణమైన ఈ రెండు వర్గాలను విస్మరించడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.