
నాలుగు నెలలుగా పస్తులు
అనకాపల్లి: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత బాలింతలను వారి పసికందులతో సహా క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామని, ఎంతో బాధ్యత గల విధులు నిర్వహిస్తున్న తమను పస్తులతో ఉంచడం తగదని 102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు సమ్మె నిర్వహించారు. నెహ్రూచౌక్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 మాసాలుగా జీతాలు లేక అప్పులు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఏర్పడిందని, నేషనల్ హెల్త్ మిషన్ కల్పించుకోవాలన్నారు. యూనియన్ జిల్లా నాయకులు నర్సింగరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జీతాలు చెల్లించక తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల అవస్థలు
ఒక రోజు సమ్మెతో నిరసన బాట పట్టిన బాధితులు