
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ముందుస్తు సమాచారం మేరకు సీఐ జి.గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి వైపు నుంచి వస్తూ పోలీసులను గమనించిన స్మగ్లర్లు కారును కొంత దూరంలో ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారు వెనక సీటుకు ప్రత్యేకంగా అర తయారు చేయించి 2 కిలోల చొప్పున ఐదు ప్యాకెట్లలో పది కిలోల గంజాయిని అమర్చారు. తమ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడంతో గంజాయి బయటపడింది. తమిళనాడు, తిరుపూర్ భారతి నగర్ స్కూల్ వీధికి చెందిన కార్తీక్ అండవర్(34), అదే రాష్ట్రం విజయపురి రోడ్ మేలాతేరు, కోవిలపట్టికి చెందిన కారు డ్రైవర్ దీపన్(34)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారుతో పాటు వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.8 వేలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. గంజాయిని కేసును ఛేదించిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు.