
శత్రుదుర్భేద్యంగా విశాఖ
● భారత్ వినియోగిస్తున్న అత్యాధునిక క్షిపణులన్నీ విశాఖలోనే తయారీ ● ఘాజీని డాల్ఫిన్ నోస్ సమీపంలో మట్టి కరిపించిన తూర్పు నౌకాదళం ● ఎన్‌ఏడీ, ఐఎన్‌ఎస్ వర్ష, డేగా బేస్‌ల వద్ద నిరంతర పహారా ● పాక్‌తో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో అప్రమత్తత
సాక్షి, విశాఖపట్నం : భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య రోజు రోజుకూ యుద్ధ వాతావరణం భీకరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని శాఖలకు అలెర్ట్ ప్రకటించింది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ క్షణంలోనైనా.. అనే నినాదంతో భారత రక్షణ రంగం త్రివిధ దళాల్ని అప్రమత్తం చేసింది. అందుకే విశాఖలోనూ కేటగిరి–2 అలెర్ట్ ప్రకటించారు. భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా వ్యవహరించేలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. సముద్రజలాల పరిరక్షణ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు సాగించే కీలకమైన భద్రతకు అవసరమైన షిప్‌లు, జలాంతర్గాములు, సర్వే వెసెల్స్.. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో కేంద్రీకృతమయ్యాయి. తూర్పు తీరం వెంబడి 2,562 కి.మీల విస్తీర్ణంలో స్థావరాల్ని ఏర్పాటు చేస్తూ.. తీర పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తోంది. దేశంలోని అన్ని సాయుధ దళాల కమాండ్‌లలో భౌగోళిక పరంగా ‘ది లార్జెస్ట్ కమాండ్’గా విస్తరించి ఉంది. ఈఎన్‌సీలో ప్రస్తుతం 37,000 మంది సిబ్బంది ఉండగా.. ఇందులో 2,895 మంది అధికారులు, 21,085 మంది నావికులు, 3,695 డీఎస్‌సీ సిబ్బంది, 9,689 మంది రక్షణ పౌరులున్నారు. ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటూ రక్షణ రంగంలో రారాజుగా మారింది. ఇప్పటికే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ(ఎన్‌ఎస్‌టీఎల్), నేవల్ ఆర్మ్‌డ్ డిపో(ఎన్‌ఏడీ)తో పాటు ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ డేగా.. ఇలా ప్రతి అంశంలోనూ విశాఖ నగరం కేంద్రంగా మారింది.
శక్తివంతమైన క్షిపణులు ఇక్కడి నుంచే..!
భారత నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన క్షిపణుల తయారీ కూడా విశాఖ నుంచే జరుగుతున్నాయి. డీఆర్‌డీవో నేతృత్వంలో పనిచేస్తున్న నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్(ఎన్‌ఎస్‌టీఎల్) ఆధ్వర్యంలో 50 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ని మట్టుబెట్టే వరుణారస్త్‌ర టార్పెడోకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అదేవిధంగా రెండు రోజుల క్రితం అరేబియా సముద్రంలో పాక్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రయోగించిన మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్(ఎంఐజీఎం) కూడా ఇక్కడే తయారైంది. దీంతో పాటు సబ్‌మైరెన్ లాంచ్‌డ్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, ఎయిర్‌టూ ఎయిర్, యాంటీ ట్యాంక్, అండర్ వాటర్ వెహికల్స్, యాంటీ సబ్‌మైరెన్ వార్‌ఫేర్ ఇలా.. శత్రుదేశాన్ని గడగడలాడించే ఆయుధ సంపత్తి విశాఖలోనే రూపుదిద్దుకుంది. అందుకే వైజాగ్ అంటేనే పాక్‌కు భయం కలుగుతుంటుంది.
1971 విజయానికి నాంది వైజాగ్
భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో అతిపెద్ద యుద్ధం జరిగింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. ఇండియన్ నేవీ కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో పాక్‌కు చెందిన యుద్ధ నౌకలు ధ్వంసమయ్యాయి. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను విశాఖలో రంగంలోకి దించారు. విక్రాంత్‌తో పాటు తూర్పు నౌకాదళాన్ని నాశనం చేసేందుకు అత్యంత శక్తిమంతమైన ఘాజీ సబ్‌మైరెన్‌ని పాకిస్థాన్ పంపించగా.. విషయం తెలుసుకున్న భారత్.. ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ సబ్‌మైరెన్‌తో ఘాజీని విశాఖ తీరం సమీపంలోనే డాల్ఫిన్ నోస్ దగ్గరలో సాగరగర్భంలోనే కుప్పకూల్చారు. దీంతో పాక్ నావికాదళంలో 80 శాతం నష్టపోయి.. ఓటమిని అంగీకరించింది. ఈ వేదన పాక్‌ని ఇంకా తొలిచివేస్తోంది. అందుకే దగ్గరలో ఉన్న పశ్చిమ నౌకదాళాన్ని దాటి.. తూర్పు నౌకాదళాన్నే ప్రతిసారీ టార్గెట్ చేస్తూ ఓటమిపాలవుతుంటుంది. ఈసారీ పాక్ మళ్లీ అదే పని చేస్తే జలసమాధి కాకతప్పదు. ఇప్పటికే నగరంలో అప్రమత్తత ప్రకటించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈఎన్‌సీ నేవల్ బేస్‌తో పాటు ఎన్‌ఏడీ, ఐఎన్‌ఎస్ వర్ష, డేగా బేస్‌ల వద్ద నిరంతర పహారా మరింత పెంచారు.
తిరుగులేని ఆయుధ సంపత్తి
ప్రపంచ రక్షణ దళాల్లో కీలకంగా వ్యవహరించేలా తూర్పు నౌకాదళం ఆయుధ సంపత్తి విషయంలోనూ బలోపేతమవుతోంది. ఐఎన్‌ఎస్ ఢిల్లీ, ఐఎన్‌ఎస్ ముంబై, ఐఎన్‌ఎస్ మైసూర్ యుద్ధ నౌకలు విశాఖ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2037 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న మరో 20 నుంచి 25 యుద్ధ నౌకలు తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనున్నాయి. అదేవిధంగా మల్టీ–రోల్ 60ఆర్ 60ఆర్. అప్‌గ్రేడ్ చేసిన యాంటీ సబ్‌మైరెన్ కమోవ్ 28 హెలికాప్టర్లు, మీడియం లిఫ్ట్ ఇ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా విశాఖలో ఒక్కొక్కటిగా కేంద్రీకృతమవుతున్నాయి. వీటన్నింటితో రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం.. దేశ రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తోంది.

శత్రుదుర్భేద్యంగా విశాఖ

శత్రుదుర్భేద్యంగా విశాఖ