
కుట్టు శిక్షణ పేరుతో కుంభకోణం
● బీసీ మహిళల సంక్షేమానికంటూరూ.257 కోట్లు స్వాహా చేసేందుకు కుట్ర ● కుట్టు మిషన్ విలువ మూడింతలు పెంచిన కూటమి నేతలు ● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత
అనకాపల్లి: బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం రూ.257 కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత విమర్శించారు. రూ.7,300లు విలువైన కుట్టు మిషన్‌కు రూ.23 వేలు ఖర్చు చూపించడం దారుణమని ఆమె అన్నారు. ఈ దోపిడీని ఆపాలని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో వై.సత్యనారాయణరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రింగ్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. లక్షమంది బీసీ మహిళలకు రూ.73 కోట్లు ఖర్చవుతుంటే, చంద్రబాబునాయుడు ప్రభుత్వం రూ.257 కోట్లు చూపించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మిగిలిన సొమ్మును పక్కదారి పట్టించారన్నారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పాలన సాగిస్తే, నేటి కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పెద్ద కంపెనీలకు టెండర్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఎల్2, ఎల్3 కంపెనీలకు టెండర్ కట్టబెట్టి కోట్లాది రూపాయలు దోచుకుంటోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, మహిళలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం నాయకులు నీటిపల్లి లక్ష్మి, నదియా, మరిపల్లి శోభ, ఎన్‌ఎస్.లక్ష్మి, ఎం. విజయలక్ష్మి, కశింకోట మండలపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తగరంపూడి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.