
ఎకరా స్థలం లీజు ఏడాదికి వెయ్యి రూపాయలేనట
● టీడీపీ కార్యాలయం పట్ల కలెక్టర్ ఔదార్యం ● నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపుపై సీపీఎం ధ్వజం
అనకాపల్లి టౌన్: పేదల స్థలాలను కాపాడాల్సిన జిల్లా కలెక్టరే రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం ఏమిటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ప్రశ్నించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ప్రయోజనాలకు, సంక్షేమానికి కృషి చేయాల్సిన జిల్లా అధికారి టీడీపీకి స్వామి భక్తి చాటుకోవడం సిగ్గు చేటని అన్నారు. జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయానికి విలువైన కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఎకరా ఏడాదికి వెయ్యి రూపాయలకే లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కోర్టుకు స్థలం లేదు కానీ అధికార పార్టీకి కేటాయింపా?
జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి వివిధ న్యాయస్ధానాలు ఓ ప్రెవేట్ భవనంలో నడుస్తున్నా, పట్టించుకోని కూటమి పాలకులు తెలుగుదేశం పార్టీకి మాత్రం రెండెకరాల భూమి కేటాయించుకోవడం తగదని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.ఎస్.అజయ్‌కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు.
అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కళాశాల కోసం కట్టిన ప్రైవేట్ భవనాన్ని న్యాయస్థానాలకు అద్దెకు ఇచ్చారని, ఆ ఇరుకు గదుల్లోనే కోర్టులను నిర్వహిస్తున్నారన్నారు. స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు లేఖలు రాసి, వినతిపత్రాలను ఇచ్చామని, స్థలాలు దొరకడం లేదని చెపుతూ వచ్చిన అధికారులు తెలుగుదేశం పార్టీ అడిగిన వెంటనే మంత్రివర్గంతో సంబంధం లేకుండా రూ. రెండు కోట్ల నుంచి మూడు కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల అద్దెతో 33 సంవత్సరాలకు భూమిని అప్పగించారన్నారు.