
నక్కపల్లిలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ కోర్టు
● వైఎస్సార్‌సీపీ హయాంలోనే రూ.1.60 కోట్లతో నిర్మాణం ● ప్రారంభించిన హోంమంత్రి అనిత ● నక్కపల్లికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి
నక్కపల్లి: బీఎస్ హాకీ క్లబ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో మంజూరైన రూ.1.60 కోట్లతో నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన ఆస్ట్రోటర్ఫ్ మినీ హాకీ కోర్టును మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి కోర్టు మన జిల్లాలో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉద్యోగి నక్కపల్లిలో హాకీ క్లబ్‌ను ఏర్పాటు చేసి వందలాది మందికి శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తర్ఫీదు నివ్వడం, ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లోను, స్పోర్ట్స్ స్కూళ్లలోనూ ప్రవేశాలు పొందారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, కోచ్ రాంబాబు, ఏరియా ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ సభ్యుడు కే వెంకటేష్, సర్పంచ్ రత్నకుమారి, బీఎస్ హాకీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, తాతాజీ, నాయకులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలతో ఆగిన ప్రారంభోత్సవం..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇక్కడ హాకీ క్రీడా మైదానాన్ని సందర్శించిన అప్పటి కలెక్టర్ రవి పట్టన్‌శెట్టికి క్రీడాకారులు తమ సమస్యలను విన్నవించారు. ప్రాక్టీసు కోసం పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన కోర్టు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సైతం ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పోర్ట్స్ సెస్ నిధులు నుంచి ఆస్ట్రోటర్ఫ్ కోర్టుకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. కోర్టు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు శంకుస్థాపన చేశారు. కోర్టు నిర్మాణం పూర్తయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో దీన్ని ప్రారంభించలేదు. ఇంతలో ఎన్నికల రావడం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకులు, హాకీ క్లబ్ నిర్వాహకులు కోర్టుకు విద్యుత్ సరఫరా విషయాన్ని హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కల్టెక్టర్‌తో మాట్లాడి సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.4.50 లక్షలు విద్యుత్ సరఫరా కోసం మంజూరు చేయించారు. దీంతో కోర్టు సమీపంలో ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం కల్పించారు. తాజాగా ఆమె దీన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో నాలుగో ఆస్ట్రోటర్ఫ్ కోర్టు నక్కపల్లిలోనే..
ఇటువంటి ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు రాష్ట్రంలో నాలుగు చోట్ల మాత్రమే నిర్మించారు. ఇప్పటి వరకు కడప, పులివెందుల, కాకినాడలలో ఉన్నాయి. తాజాగా నక్కపల్లిలో నిర్మించారు. ఇటువంటి కోర్టులు అనుభవం ఉన్న ఫీల్డ్ హాకీ క్రీడాకారులకు మరిన్ని మెలకువలు నేర్పించడం కోసం ఉపయోగిస్తారు.
కోర్టు నిర్మాణం ఇలా..
ఈ కోర్టును నాలుగు రకాల ముడిసరుకును ఉపయోగించి నిర్మిస్తారు. మొదటగా గ్రావెల్ వేసి ఆపైన మెటల్ గ్రౌండ్ వేస్తారు. చదునుగా చేసిన తర్వాత ఖరీదైన మొత్తటి రబ్బర్ పౌడర్ మిశ్రమంతో కలిపి తారురోడ్డు మాదిరిగా గ్రౌండ్ తయారు చేస్తారు. తుది దశకు చేరకున్న తర్వాత కృత్తిమ గడ్డితో తయారు చేయబడిన టర్ఫ్ అనే షీటును పరిచి పై పొర మీద సన్నటి ప్లాస్టిక్ వైరు ఒక పొరగా అమర్చి దీనిపై ఒక అంగుళం రబ్బరు షీటుతో పైభాగాన్నా క్రీడాకారులు ఆడేందుకు అనువుగా ఉండేలా తయారు చేస్తారు. ఇటువంటి కోర్టు ఉమ్మడి విశాఖ జిల్లాలో నక్కపల్లిలో మాత్రమే ఉంది. ఈ టర్ఫ్ కోర్టు కింద భాగంలో వాటర్‌ను స్ప్రే చేసేందుకు 5 హెచ్‌పీ మోటార్లను అమర్చారు. వాటర్ స్ప్రే చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టులో త్వరగా ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ఫీల్డర్స్ వేగంగా పరిగెత్తడానికి, బంతిని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాళ్లను నియంత్రించడానికి కూడా ఎక్కువ సహకరిస్తుంది. ఇటువంటి ఆస్ట్రోటర్ఫ్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేయడం వల్ల హాకీలో క్రీడాకారులు బాగా రాణిస్తారని బీఎస్ హాకీ క్లబ్ అధ్యక్షుడు బలిరెడ్డి సూరిబాబు తెలిపారు.

నక్కపల్లిలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ కోర్టు