
నిశీధి వేళలో గ్రావెల్ మాఫియా అలజడి
● వెంకటాపురం కొండలోగ్రావెల్ తవ్వేందుకు యత్నం ● వాహనాలను అడ్డుకున్న స్థానికులు ● కూటమి నేతలు రంగంలోకి దిగినా తేలని పంచాయితీ ● తాత్కాలికంగా విరమించిన తవ్వకందారులు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాష్ట్రంలో అతి పొడవైన కొండల్లో ఒకటైన చోడపల్లి – కొత్తూరు కొండను మింగేసే ప్రయత్నమిది.. అంతా నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ ఉన్నపళంగా గ్రావెల్ మాఫియా వాలిపోయింది. అక్కడ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగుల్ని చూసి గ్రామస్తులు వెళ్లగా.. పది లారీలు, ఒక జేసీబీ కనిపించాయి. ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ అడ్డుకున్నారు. స్థానిక కూటమి నేతలు రంగంలోకి దిగినా వారు వెనక్కి తగ్గకపోవడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురానికి ఆనుకొని కొండ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రావెల్‌కు ఉన్న డిమాండ్ వల్లే..?
యలమంచిలి నియోజకవర్గంలో గ్రావెల్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అటవీ శాఖ, పర్యావరణ నిబంధనల మేరకు నియోజకవర్గంలోని చాలా కొండల్లో ఎటువంటి మైనింగ్ తవ్వకాలకు అనుమతి లేదు. లే –అవుట్లకు, రహదారి విస్తరణ పనులకు, పరిశ్రమలకు, ఇతరత్రా అవసరాల కోసం గ్రావెల్ డిమాండ్ అధికంగా ఉంది. దీని దృష్ట్యా రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వి తస్కరించుకుపోతున్నారు. అది కూడా ఎటువంటి సీనరైజ్ చెల్లించకుండా, స్థానికుల్ని సంప్రదించకుండా తరలించడంతో నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాల వివాదం రాజుకూనే ఉంది. తాజాగా సోమవారం రాత్రి 10 లారీలు, ఒక పెద్ద జేసీబీ చేరుకుని గ్రావెల్‌ను తవ్వేందుకు సమాయత్తమయ్యారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రావెల్ వ్యవహారాలు చూసే స్థానిక కూటమి ప్రతినిధి బంధువు, ఎం.జగన్నాథపురానికి చెందిన నేత, అచ్యుతాపురానికి చెందిన నేత, రాంబిల్లికి చెందిన నేత రంగంలో దిగి స్థానికుల్ని అడ్డుకోవద్దని కోరారు. ఈ పంచాయితీ తేలకపోవడంతో తవ్వకాలను తాత్కాలికంగా ఆపేసినట్లు సమాచారం.
రాత్రి వేళ జోరుగా తవ్వకాలు
ప్రధానంగా రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో రాత్రిళ్లు గ్రావెల్ తవ్వకాల అలజడి రేగుతోంది. ఇటీవల కాలంలో ఎర్రవరం కొండల వద్ద, కొండకర్ల కొండల వద్ద, పాటిపల్లి కొండల వద్ద, పంచదార్ల కొండల వద్ద గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న ముఠా స్థానికుల అభ్యంతరాలు, ఫిర్యాదులతో తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా వెంకటాపురం కొండలపై దృష్టి సారించడంతో వివాదం మొదలైంది. స్థానికుల సహకారంతో సాధ్యమైనంత త్వరలోనే గ్రావెల్ తవ్వకాలు మొదలు పెట్టాలనే యోచనతో కూటమి పెద్దలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మైనింగ్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.