
టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
● ఎమ్మెల్యే, బత్తుల మధ్య వర్గపోరు ● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల రాకతో డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే ● ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూసిన అధికారులు ● సమావేశం ఆలస్యంపై ఎంపీడీవోనునిలదీసిన సభ్యులు
బుచ్చెయ్యపేట: చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్యన వర్గ పోరు తార స్థాయికి చేరింది. నెల రోజుల కిందట ఎమ్మెల్యే రాజు బుచ్చెయ్యపేటలో మండల టీడీపీ కార్యకర్తల విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. స్ధానికంగా ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తాతయ్యబాబుకు సమాచారం ఇవ్వకపోగా కటౌటులో తాతయ్యబాబు ఫొటో వేయలేదు. దీనిపై తాతయ్యబాబుతో పాటు అతని వర్గీయులు మేడివాడ రమణ, తలారి శంకర్,సయ్యపురెడ్డి మాధవరావు ఎమ్మెల్యేపై ఆగ్రహం చెందారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగే సర్వసభ్య సమావేశానికి వస్తున్నానని ఎమ్మెల్యే రాజు ముందుగానే అధికారులకు, నాయకులకు సమాచారం అందించారు. అప్పటికే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మండల సమావేశానికి విచ్చేశారు. ఎమ్మెల్యే రాజు అనుచరులు తాతయ్యబాబు మండల సమావేశానికి వచ్చినట్టు సమాచారం అందించారు. పదిన్నరకు ప్రారంభం కావాల్సిన మండల సమావేశం మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా ఎమ్మెల్యే రాకపోవడంతో సభ ప్రారంభం కాలేదు. దీంతో పలు గ్రామాల నుంచి వచ్చిన సభ్యులు అసలు సమావేశం ఉందా లేదా అంటూ ఎంపీడీవో విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎంపీడీవో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు గౌరవ అధ్యక్షుడిగా మండల సమావేశాన్ని నడిపించారు. టీడీపీలో గ్రూపు రాజకీయాల వల్ల ఎవరి వైపు వెళ్లాలో తెలియడం లేదంటూ సమావేశానికి వచ్చిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గుసగుసలాడుకున్నారు.

టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు